ఉద్యోగులే కాదు.. విద్యార్థులు కూడా చాట్ జీపీటీ వాడేస్తున్నారు. హోంవర్క్ చేయాలన్నా, పరీక్షలకు సిద్ధం కావాలన్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా చాలామంది దీన్నే ఆశ్రయిస్తున్నారు. అయితే, ఇది జవాబులు నేరుగా ఇవ్వడం వల్ల విద్యార్థులు సొంతంగా ఆలోచించడం తగ్గిపోతుందేమో అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఓపెన్ ఏఐ చాట్ జీపీటీలో ఒక వినూత్నమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ‘స్టడీ మోడ్’.
ఇది విద్యార్థులకు నేరుగా జవాబులు ఇవ్వదు. బదులుగా, ప్రశ్నల ద్వారా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ, విద్యార్థులు సొంతంగా ఆలోచించి, సమస్యను పరిష్కరించేలా గైడ్ చేస్తుంది. ఓపెన్ ఏఐ చెబుతున్న ప్రకారం.. విద్యార్థులు స్టడీ మోడ్‌తో కేవలం సూచనలు, సలహాలే అందుకుంటారు. అలా వారి అవగాహన పెంచుకుంటూ, పరిష్కారాలు కనుక్కోగలుగుతారు.
ఇది విద్యార్థులకు నిజమైన ఇంటరాక్టివ్, ఆకర్షణీయమైన అభ్యాస అనుభవాన్ని అందించడానికి ఉద్దేశించిందని ఓపెన్ ఏఐ నిర్వాహకులు చెబుతున్నారు. అంటే, ఇకపై పిల్లలు కేవలం కాపీ-పేస్ట్ చేయకుండా, నిజంగా నేర్చుకుంటారు అన్నమాట! స్టడీ మోడ్ ఫీచర్ ప్రస్తుతం ఫ్రీ, ప్లస్, ప్రో, టీమ్ ప్లాన్లలో లాగిన్ అయిన వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. ఈ సరికొత్త స్టడీ మోడ్ విద్యార్థులకు ఎంతవరకు సాయపడుతుందో, వారి స్కిల్స్‌ను ఏమేరకు పెంచుతుందో చూడాలి!