మారుతున్న జీవనశైలి.. యవ్వనంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. అందంతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తున్నది. ఫలితంగా.. ముప్ఫై ఏళ్లకే ముఖ వర్చస్సు తగ్గిపోతున్నది. ముడతలు పడి ‘ముదిమి’కి చేరువవుతున్నది. నలభైల్లోనే ఊబకాయంతో శరీరం ఫిట్నెస్ కోల్పోతున్నది. యాభై ఏళ్లు నిండకుండానే.. వృద్ధాప్యం స్వాగతం పలుకుతున్నది. అయితే.. ఈ సమస్యలన్నిటినీ ఒకేఒక్క ‘డ్యాన్స్’ తరిమేస్తుంది. రోజూ ఓ గంట నృత్యం చేస్తే.. నిత్య యవ్వనం మీ సొంతమవుతుంది. అందానికి అండగా నిలవడంతోపాటు శరీరాన్నీ షార్ప్‌గా మార్చేస్తుంది.
నృత్యంలో సెకండ్ల వ్యవధిలోనే ముఖ కవళికలు మారిపోతుంటాయి. అంటే.. ఫేషియల్ ఎక్సర్సైజ్లు పూర్తయినట్టే! దాంతో ముఖ కండరాలు బలంగా తయారవుతాయి. ముఖంపై గీతలు, ముడతలు తగ్గుముఖం పడతాయి. రక్త ప్రసరణతోపాటు ముఖవర్చస్సూ మెరుగవుతుంది.
డ్యాన్స్‌తో జ్ఞాపకశక్తి పెరుగుతుందని ‘ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ నిర్వహించిన అధ్యయనం తేల్చింది. కొన్నిరకాల ఏరోబిక్ డ్యాన్స్ వ్యాయామాలు.. మెదడులో జ్ఞాపకశక్తిని నియంత్రించే హిప్పోకాంపస్ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయట. ఫలితంగా, చిత్తవైకల్యం చిత్తవుతుంది.
సంగీతానికి తగ్గట్టుగా చేసే నృత్యంతో ఒత్తిడి తగ్గుతుందని ‘జర్నల్ ఆఫ్ అప్లయిడ్ జిరంటాలజీ’ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఉత్సాహంగా వేసే స్టెప్పులు.. నిరాశను తరిమికొడతాయి.
శరీరంలో సెరటోనిన్ హార్మోన్ స్థాయులను పెంచుతాయి. ఇవి మనిషి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. దాంతో, శరీరమే కాదు.. ఆలోచనలూ యవ్వనంగా మారుతాయి.
డ్యాన్స్ చేస్తున్నంత సేపు శరీరం ఉల్లాసంగా ఊగిపోతుంది. ఫలితంగా ఫిట్నెస్ మరింత మెరుగుపడుతుంది. బరువు తగ్గడంతోపాటు శరీరం నాజూగ్గా తయారవుతుంది.
వయసు మీద పడేకొద్దీ వేధించే సమస్య.. కీళ్ల నొప్పులు. నృత్యంతో ఈ సమస్యకు ఇట్టే చెక్ పడిపోతుంది.
నృత్యం వల్ల శారీరక పనితీరు మెరుగుపడుతుందని ‘ద స్కాలర్లీ పబ్లిషింగ్ అండ్ అకడమిక్ రిసోర్సెస్ కోయలిషన్’ పరిశోధన వెల్లడించింది.
ఎంత వేగంగా డ్యాన్స్ చేస్తే.. అంతగా హృదయ స్పందన వేగం పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. దీర్ఘకాలంలో జీవన నాణ్యతను పెంచుతుంది.
ఇక భాగస్వామితో కలిసి చేసే డ్యాన్స్.. బంధాలను మరింత బలపరుస్తుంది. ఫలితంగా, ఆనంద భావనలు పెరిగి.. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గడంతోపాటు రోగ నిరోధక వ్యవస్థను దృఢంగా మారుస్తుంది.
మరెందుకు ఆలస్యం! మ్యూజిక్ సిస్టం ఆన్‌చేసి.. ఏజ్‌తో మ్యాజిక్ చేసేయండి. ఇష్టమైన పాటలకు స్టెప్పులేస్తూ.. వయసును ఒక్కో స్టెప్పు తగ్గించుకోండి.