ఏరా బాధగా ఉందా… ఏంటి బుజ్జీ దిగులుగా ఉన్నావా… పద ఓ కాక్టైల్ వేద్దాం… అని ఇప్పుడు ఎవర్నయినా పిలవచ్చు. ఎందుకంటే ఇదేం బార్లో దొరికేది కాదు. పబ్బులకు వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిషాను మించిన హుషారునిచ్చే హార్మోన్లు మనలోనే ఉన్నాయి. వాటిని రెచ్చగొట్టి పచ్చని జీవితాన్ని పొందొచ్చు. నాలుగు పేర్లతో ఉండే ఇవి కలిస్తే… జీవితానికి నాలుగు రకాలుగా మేలుచేస్తాయి. మన గురించి మనం ఆలోచించుకుంటూ, చిన్నచిన్న ఆలోచనలను ఆచరిస్తూ ముందుకెళితే సరి… ఇవి ఉబ్బితబ్బిబ్బు అయిపోయి, మనల్ని ఆనందపుటంచులకు చేరుస్తాయి. బాధను మరిపించి.. సంతోషపు తలుపులు తెరిపించే ఈ హార్మోన్ కాక్టైల్ గురించి మానసిక నిపుణులు ఏం చెబుతున్నారంటే…
అంతా నీలోనే ఉంది… అంటుంది తత్వం. అవును నిజమే… అంటున్నది సైన్స్. మనం ఏ ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతికి వెంపర్లాడతామో… దాని తాళం చెవి మన శరీరంలోనే ఉందన్నమాట. మనలో హ్యాపీ హార్మోన్లుగా పిలిచే ఈ నాలుగు… మంచి స్థాయిలో ఉంటే మనం బాగున్నట్టే. వాటిని ఎలా పెంచుకోవాలన్న దానికీ మార్గాలున్నాయి…
మనం ఏదైనా పనిచేస్తాం. అప్పుడు బాగా చేశావని ఎవరైనా వెన్నుతడితే… ఎంత ఉత్సాహం కలుగుతుందో కదా! డోపమైన్ అలాంటి పనే చేస్తుంది. ఏదైనా క్లిష్టమైన పనిని పూర్తి చేసినప్పుడు, ఏదైనా ఇష్టమైన పదార్థం తింటున్నప్పుడు, సుందరమైన ప్రదేశాన్ని చూస్తున్నప్పుడు దీని స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి. ఒకరకంగా చెప్పాలంటే సంతృప్తి భావనను కలిగించే హార్మోన్ ఇది. దీన్ని పెంపొందించుకోవాలంటే…
మూడ్‌ని నియంత్రణలో ఉంచి, డిప్రెషన్‌ని దూరం చేయడంలో సెరటోనిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని స్థాయులు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు.
నమ్మకం, ప్రేమ, అనుబంధాలను పెంపొందించడంలో ఆక్సిటోసిన్ కీలకంగా పనిచేస్తుంది. మనకు ఇష్టమైన వాళ్లను తాకినప్పుడు, మానసికంగా చక్కని అనుబంధాలను అనుభూతి చెందినప్పుడు ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. అందుకే దీన్ని లవ్ హార్మోన్‌గా పిలుస్తారు.
శరీరంలో సహజంగా నొప్పిని తగ్గించేందుకు ఎండార్ఫిన్లు పనిచేస్తాయి. ఒత్తిడి, అసౌకర్యం లాంటివి కలిగినప్పుడు సాంత్వన కలిగించేందుకు ఈ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.
ఇంకేం… మీకు నచ్చినట్టు హ్యాపీ కాక్టైల్ని మిక్స్ చేసుకోండి. ఉదయం జాగింగ్‌కి వెళ్లండి (సెరటోనిన్, ఎండార్ఫిన్). తర్వాత నచ్చిన టిఫిన్ లాగించండి (డోపమైన్). తర్వాత కాసేపు స్నేహితులతో బాతాఖానీ కొట్టండి (ఆక్సిటోసిన్).. సాయంకాలం ఫన్నీ షో చూసి(ఎండార్ఫిన్)… చక్కగా నిద్రపోండి! సంతోషాన్ని మనమే పిలవాలి… పిలవందే ఎవ్వరూ రారు!