భారతీయ మహిళలపై ‘రొమ్ము క్యాన్సర్’ పంజా విసురుతున్నది.ఒకప్పుడు వృద్ధాప్యంలోనే సోకే ఈ మహమ్మారి.. ఇప్పుడు 40 ఏండ్ల నడివయసు వారిలోనూ కనిపిస్తున్నది. గత మూడు దశాబ్దాలలో ఈ వ్యాధి తీవ్రత భారీగా పెరిగింది. ఈ రుగ్మతపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఏటా అక్టోబర్ మాసాన్ని ‘పింక్ అక్టోబర్’గా జరుపుతున్నది.
మహిళలను అత్యంత ప్రభావితం చేసే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ముందుంటుంది. మహిళల్లో కనిపించే క్యాన్సర్లలో.. 28.2 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులే ఉంటున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల వెల్లడించింది. ‘క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్’ నిర్వహించిన సర్వే ప్రకారం.. 40 ఏళ్లలోపు వారిలో 20 శాతం మంది రొమ్ము క్యాన్సర్ బారినపడే అవకాశం ఉన్నదని వెల్లడైంది. జన్యు ఉత్పరివర్తనలు, స్థూలకాయం, మధుమేహం, జీవనశైలిలో మార్పులు, పోషకాహార లోపం, అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారం ఎక్కువగా తీసుకోవడంతోపాటు పర్యావరణ కాలుష్య కారకాలు కూడా రొమ్ము క్యాన్సర్కు దారి తీస్తున్నాయి.
ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించడంతోపాటు సకాలంలో సరైన చికిత్స అందించడం వల్ల బాధితుల జీవితకాలాన్ని మెరుగుపరుచవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకోసం మెరుగైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ నివారణకు ప్రస్తుతం అనేక అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయనీ, శస్త్రచికిత్స, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ డ్రగ్ థెరపీతోపాటు ఇమ్యూనోథెరపీలాంటి చికిత్సలతో వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని అంటున్నారు. సోనాలి బింద్రే, తాహిరా కశ్యప్, మహిమా చౌదరి లాంటి ప్రముఖులు రొమ్ము క్యాన్సర్తో పోరాడి, సరైన చికిత్స ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధిని అధిగమించారని గుర్తుచేస్తున్నారు.
కారణాలు
రొమ్ము క్యాన్సర్ పెరగడానికి కారణాలు అనేకం. అధిక బరువు, ఊబకాయం ప్రధాన కారణాలుగా పలు అధ్యయానాలు చెబుతున్నాయి. మద్యపానం అలవాటు ఉండే మహిళల్లోనూ ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నది. శారీరక శ్రమ లేకపోవడం కూడా ముఖ్య కారణమే! సంతానలేమితో బాధపడేవారు, గర్భనిరోధక మాత్రలు అతిగా తీసుకునేవారు, పిల్లలకు తల్లిపాలు పట్టనివారు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో వారసత్వంగానూ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.