పుస్తకాలను మించిన ఉత్తమ స్నేహితులు లేరు
కథా సాహిత్యంలో కొత్తదారి
ఆధునిక స్త్రీలు ఉద్యోగాలు, వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. తమ ప్రతిభతో వాటిలో రాటుదేలుతున్నారు. ఇది పట్టణ స్త్రీల బతుకు చిత్రం. ఇక గ్రామాల్లో పొలం పనులు మొదలుకుని ఇతర వృత్తుల్లోనూ స్త్రీలు తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే, ఈ రెండు వాతావరణాల్లోనూ స్త్రీలకు పురుషుల నుంచి అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ వాస్తవాన్ని ‘జమిలి పోగు’ సంకలనంలో పన్నెండు కథల్లో అక్షరీకరించారు రుబీనా పర్వీన్. సమాజంలో జరిగిన సంఘటనలనే ఈ కథలకు ఇతివృత్తాలుగా ఎంచుకున్నారు. మొదటి కథ ‘ఖులా’లో దారితప్పిన భర్త నుంచి విడివడి బతకగలనని ధైర్యం ప్రకటించే స్త్రీ కనిపిస్తుంది. తమ కూతుళ్లు గొప్పగా, ఉన్నతంగా ఎదగాలని కోరుకునే ఓ తండ్రి విశిష్ట వ్యక్తిత్వాన్ని ‘అబ్బాజాన్’లో చిత్రించారు.
ఈ కథ ఎంతోమంది తండ్రులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. కోర్టులు, చట్టాలు కాకుండా సాటి మనుషుల శిక్ష నుంచి బయటపడి తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న స్త్రీ ‘మక్సూదా’లో కనిపిస్తుంది. పురుషాహంకారాన్ని తోసేసి తన జీవితాన్ని తన అదుపులోకి తెచ్చుకున్న ఓ ఆంత్రప్రెన్యూర్ కథ ‘వన్ పర్సన్ కంపెనీ’. ఆడపిల్లలు పుడితే శోక ప్రకటన చేసే దుష్ట సంప్రదాయాన్ని రూపుమాపాలన్న సందేశంతో ‘శోక ప్రకటన’ కథ సాగుతుంది. ఇక ‘దేవ్లి’ కథ సింగరేణిలో పనిచేస్తూ వంచన గురైన మహిళ అడ్డుగోడను బద్దలు కొట్టి ముందుకు సాగాలని నిర్ణయించుకుంటుంది. ఇలా రుబీనా పర్వీన్ తొలి కథా సంకలనమైన ‘జమిలి పోగు’లో స్త్రీలు మొదట్లో బేలగా కనిపిస్తారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఆటంకాలను, ఆంక్షలను దాటుకుని తమదైన స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టే నిర్ణయాలు తీసుకుంటారు. విజేతలుగా నిలుస్తారు.
జమిలి పోగు
రచన: రుబీనా పర్వీన్
పేజీలు: 125; ధర: రూ. 145
ప్రచురణ: సైరా పబ్లికేషన్స్
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, ప్రముఖ పుస్తకాల దుకాణాలు
బుక్ షెల్ఫ్
షిరిడీ సాయిబాబా అంటే ఎవరు?
రచన: జస్టిస్ బి. చంద్రకుమార్
పేజీలు: 104;
ధర: అమూల్యం
ఫోన్: 89783 85151
వంశీ కథలు- 2024
సంకలన కర్త: డా॥ తెన్నేటి సుధాదేవి
పేజీలు: 177;
ధర: రూ. 200
ప్రచురణ: వంశీ ప్రచురణలు
ప్రతులకు:
ఫోన్: 98490 23852
మనసు చెప్పిన ముచ్చట్లు
రచన: పద్మా దాశరథి
పేజీలు: 140; ధర: రూ. 200
ప్రచురణ: జేవీ పబ్లికేషన్స్
ప్రతులకు:
ఫోన్: 85588 99478