భారతీయ రోడ్లపై చక్కర్లు కొట్టే ఆటో రిక్షా.. ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై మెరిసింది. ప్రఖ్యాత ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ లూయిస్ విట్టన్.. మన ఐకానిక్ త్రీ వీలర్‌ను విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగ్‌గా మార్చేసింది. ఆటోరిక్షా ఆకారంలో అందంగా తయారైన ఈ ప్రీమియం హ్యాండ్‌బ్యాగ్.. ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేస్తున్నది. తాజాగా నిర్వహించిన 2026 కలెక్షన్స్‌లో ఆటోరిక్షా బ్యాగులతోపాటు మరిన్ని ఫ్యాషన్ వస్తువులను ప్రదర్శనకు ఉంచింది. భారతీయ సంస్కృతి ప్రేరణతోనే ఈ బోల్డ్ కలెక్షన్ తీసుకొచ్చినట్టు సంస్థ చెబుతున్నది. ఈ కలెక్షన్ ద్వారా భారతీయ కళను మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్టు వెల్లడించింది.
ఫ్యాషన్ రాజధాని పారిస్‌కు చెందిన ఈ లగ్జరీ బ్రాండ్.. గతంలోనూ ఇలాంటి విభిన్నమైన డిజైన్లతో బ్యాగులను తీసుకొచ్చింది. విమానం, చేప, హాంబర్గర్ ఆకృతుల్లోనూ హ్యాండ్‌బ్యాగ్స్ తయారుచేసింది. అయితే.. ఇలాంటి విచిత్రమైన మోడల్స్‌ను తీసుకురావడం వెనక సంస్థ ఉద్దేశం వేరే ఉందని నిపుణులు అంటున్నారు.
ఫ్యాషన్ ప్రియులను ఆకర్శించడంతోపాటు విభిన్న సంస్కృతులను ప్రోత్సహించడానికి దీనిని ఒక వేదికగా మలుచుకుంటున్నదని చెబుతున్నారు. స్వచ్ఛమైన లెదర్‌తో ఈ బ్యాగును రూపొందించారు. దానికి బంగారం, వెండితోపాటు ఇత్తడి తొడుగులతో మెరుగులు దిద్దారు. అందుకే.. ఈ ఆటోరిక్షా బ్యాగ్ ధర ఆకాశాన్ని తాకుతున్నది. ఒక్కో హ్యాండ్‌బ్యాగ్ దాదాపు రూ.35 లక్షల దాకా పలుకుతున్నది.