మా నాయనమ్మ వాళ్లింట్లో నాన్నే పెద్దవాడు. పద్నాలుగు మంది సంతానంలో చిన్నప్పుడే పోయినవాళ్లు పోగా, ముగ్గురు మేనత్తలు, ఇద్దరు చిన్నాయనలు ఉండేవారు. అయితే మా అమ్మానాన్నలకు నేనూ, అక్కా బాగా ఆలస్యంగా పుట్టాం గనుక మా కజిన్స్ చాలామంది కంటే మేము చిన్నవాళ్లం.
మే నత్తల్లో ముగ్గురివీ జనగామ దగ్గర్లోని అక్కరాజుపల్లి, అమ్మాపురం, రామరాజుపల్లి ( తరిగొప్పుల ) ఊర్లు. మా మేనవదినలిద్దరిది కూడా అక్కడే నర్మెట్ట, పోతారం గ్రామాలు. అవడానికి అవన్నీ వరంగల్ జిల్లాలోవే అయినా.. అప్పట్లో సవారీ కచ్చడాల్లో వెళితే ఆరేడు గంటలు పట్టేదట. మేము వెళ్లడం కన్నా మా అత్తయ్యలూ, వాళ్ల పిల్లలే ఎక్కువగా ఇటువైపు వచ్చేవారు.మాకు కొంచెం ఊహ వచ్చేసరికి అటువైపు ఊర్లకు… ముఖ్యంగా తరిగొప్పులకు అశోకా బస్ అనే ప్రైవేట్ బస్ సర్వీస్ ఉండేది. అది ఇప్పటి బస్సుల్లా పెద్దగా ఉండేది కాదు. పైగా ముందు భాగం కుక్క మూతిలా ఉండేది. ఓ ఎర్ర కళ్ల లావాటి డ్రైవరూ, చీపురు పుల్లకు అంగీ, లాగూ తొడిగినట్లుండే కండక్టరూ, మసిగుడ్డల క్లీనిరూ ఉండేవారా బస్సుకు. మా ఊరు నుండే ఆ బస్సు బయల్దేరేది. మేము మొత్తం మీద ఆ బస్సులో రెండు మూడుసార్లు ప్రయాణించి ఉంటాం. ముందుగా నాన్న ఎవరినైనా పంపించి ఆ బస్సు ఎన్ని గంటలకు బయల్దేరుతుందో తెలుసుకుని రమ్మనేవాడు. ఆ టైముకు ఓ గంట ముందే ‘తొందరగ పోండి, బస్సు ఎత్తిపోతది. మళ్ల కష్టం అయితది’ అంటూ మమ్మల్ని తొందరపెట్టేవాడు. మా వెంట ఓ మగమనిషి తప్పనిసరి!
రైల్వే స్టేషన్‌కి వెళ్లే దారిలో కమాన్లున్న ఓ వరండా ఇంటి ముందు నుండి బస్సు బయల్దేరేది. మేము అక్కడికి చేరి అక్కడున్న అరుగుల మీద కూచొనీ, కాస్సేపు నిలబడీ, మరి కాస్సేపు అటూ ఇటూ నడిచీ.. ఇలా గంటసేపు అయ్యాక మొదట క్లీనరు వచ్చేవాడు. అప్పటికే ఊరికెళుతున్నామన్న మా ఉత్సాహం నీరుగారిపోయేది. అతడు ఓ పాత మసిగుడ్డతో బస్సునంతా తుడిచేవాడు. ‘ఆ గుడ్డకున్న మురికి బస్సుకంటుతది గని, బస్సు మురికి ఎట్ల పోతది?!’ అనుకునేవాళ్లం మేము. మొత్తానికి క్లీనర్ బస్సు తుడిచాక అక్కడక్కడా ఉన్న ప్రయాణీకులు బస్సు దగ్గరికి వచ్చేవారు బస్సు బయల్దేరుతదన్న ఆశతో. మరి కాసేపటికి భుజానికో బ్యాగేసుకుని చీపురుపుల్ల కండక్టర్ వచ్చేవాడు. అతగాడు ఆ బ్యాగెలా మోస్తున్నాడా అనిపించేది.
కండక్టరు వచ్చినంత మాత్రాన బస్సు ఖాయంగా కదులుతుందని కాదు. కనీసం ఎనభై శాతం సీట్లకు సరిపడా జనం ఉంటేనే అతడు టికెట్లు ఇచ్చేవాడు. సగం కన్నా తక్కువ మంది ఉంటే ‘ఇయ్యాల ట్రిప్పు క్యాన్సల్. రేపు రా పోండి!’ అనేవాడు. ‘అయ్యో ! బస్సు నడువదా పిలగా?! ఎట్ల మరి ?!’ అని పెద్దవాళ్లు అడిగేవారు. ‘పక్కన ఊరికెల్లి సంటి పోరగాల్లతోని నడిశొచ్చినం. గిప్పుడు లేదంటె ఎట్ల?! జర నడిపియ్యరాదుండ్రి !’ అని ఆడవాళ్లు బతిమిలాడేవారు. ‘అహాఁ , మంది లేంది నడువది. మా సారు కోపం జేస్తడు’ అనేవాడతను. కొంచెం సేపు చూసి అందరూ చేసేదేం లేక వెళ్లిపోయేవారు. మేము ఇంటికొచ్చేసేవాళ్లం.
ఇక బాగా జనం ఉంటే కండక్టరు టిక్కెట్లిచ్చి అప్పుడు మసిగుడ్డల క్లీనరును డ్రైవరు ఇంటికి పంపేవాడు. ‘ముందర్నే పంపొచ్చుగదా!’ అని మేము అనుకునేవాళ్లం గానీ డ్రైవరు హోదా కొంచెం ఎక్కువ గనుక ఇక్కడ రంగం సిద్ధం అయ్యాకే అతడు రంగంలోకి దిగేటోడు. ఆయన సరాసరి నిద్రలోంచే నడిచి వచ్చినట్టుగా ఉండేవాడు. ఒక్కోసారి లుంగీ బనీను మీదా, మరోసారి అంగీ తొడుక్కుని గుండీలు పెట్టుకోకుండా, ఇంకా మన అదృష్టం బాగా లేకుంటే ఒదులొదులు నిలువు గీతల నిక్కరు మీదా వచ్చేవాడు. ‘డైబరొచ్చిండు, ఇగ బస్సు శాలు అయితది’ అని అందరూ పౌరాణిక సినిమాలో ఎన్టీయార్ దేవుడి వేషంలో కనబడగానే చప్పట్లు కొట్టి సంతోషపడినట్టు విపరీతంగా ఆయన రాకకు ఆనందించేవారు.
డ్రైవరు పేరు రంగరాజు అని జ్ఞాపకం. వాళ్ల తమ్ముడు రత్నం రాజు మా ఊర్లోనే ఖానిగీ బడి నడిపేవాడు. ఆయన్నందరూ ‘రక్తం రాజు సారు’ అనేవారు. ఆయనసలు రక్తం రాజు కాదు గానీ, ఈ డ్రైవరు గారు మాత్రం రక్తం కళ్ల రాజే! ఎర్రటి కళ్లతో ఉండేవాడు. మొత్తానికి బస్సు బయల్దేరేది. ఊరు దాటేదాకా ఆ దారిలో ఎవరింటి ముందు చెయ్యి చూపిస్తే వాళ్ల ఇంటి ముందు ఆపి ఎక్కించుకునేవారు.
బస్సు కాస్త వేగం పుంజుకున్నాక అది చేసే చప్పుడు కూడా అంతకంతకూ పెరిగేది. ఓ పది ఉరుములు ఒకేసారి వచ్చినట్టు, సైలెన్సర్స్ చెడిపోయిన ఆరేడు మోటార్ సైకిళ్లు ఒకేసారి నడిపినట్టు, ఓ రెండు పిండి గిర్నీలు ఒకేసారి పనిచేసినట్టు… ఇలా ఆ బస్సు వెళుతుంటే వచ్చే ఘోరమైన శబ్దం వర్ణనాతీతంగా ఉండేది. ఎవరేం మాట్లాడినా ఏమీ వినబడకుండా ఉండేది.
బస్సు సగం దూరం పోయాక ‘ఇంజను ఉడుకయితాంది. నీళ్లు పొయ్యాలె’ అంటూ ఏదో పాక టీ కొట్టు దగ్గర బస్సును ఆపేవాడు డ్రైవరు. దాంతో ఒకరి వెనుక ఒకరు మగవాళ్లంతా దిగేవారు. ఆ పూరి గుడిసె వాళ్లకు ముందే తెలిసినట్టు అయిదు నిమిషాల్లో ఎందరికి కావాలో అందరికి చాయ్ తయారు చేసేవాళ్లు. మాటవరుసకైనా బస్సులో ఉన్న భార్యనో, తల్లినో, అక్కచెల్లెళ్లనో ‘టీ తాగుతారా’ అని అడిగేవారు కాదు ఆ మగవాళ్లు. గప్‌చుప్‌గా తాగి వచ్చేవాళ్లు. ఒకళ్ళిద్దరు మాత్రం ఆర్డర్ చేసిన చాయ్‌ని ఆ హోటల్ సర్వర్ ఆరు గ్లాసులు దిగేసేలా రింగులున్న ఓ ఇనుప బుట్ట లాంటి దాంట్లో గాజు గ్లాసుల్లో మంచి రంగున్న చాయ్ తెచ్చి బస్సులో ఉన్న ఆడవాళ్లకు ఇచ్చేవాడు. వాళ్లు అదేదో అమృతం తాగుతున్నట్టు చుట్టూ ఉన్నవాళ్ల వైపు ఓసారి గర్వంగా చూసి ‘బుర్రూ బుర్రూ’మని చప్పుడు చేస్తూ తాగేవాళ్లు.
క్లీనర్ ఓ పెద్ద బకెట్లో అక్కడ దగ్గర్లో నడుస్తున్న ఓ మోటారు పంపు దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చి ఇంజనులో పోసేవాడు. డ్రైవరు, కండక్టరు, క్లీనరు కూడా ఫ్రీగా ఆ హోటల్ వాడి చాయ్ తాగేవారు. అలా ఆగినప్పుడు మరీ సాయంత్రమైతే… ఆ దగ్గర్లో ఉన్న తాటిచెట్ల కిందికి వెళ్లి కల్లు తాగేవారు. వాళ్లు వచ్చాక బస్సంతా అదే వాసన వచ్చేది. కొన్ని సార్లు వేగంగా వెళుతున్న బస్సు పెద్ద చప్పుడుతో అమాంతం ఆగిపోయేది.
‘ఏమయింది?! ఎందుకు ఆగింది ?!’ అని అందరూ అడుగుతుండగానే’ బస్సు దిగున్రి, టైరు పంపుచారు (పంక్చర్) అయింది’ అనేవాడు క్లీనరు. మొత్తం ప్రయాణీకులంతా దిగి దగ్గర్లో ఉన్న చెట్టూ, పుట్టా-రాయీ, రప్పా చూసుకుని కూచునేవారు. క్లీనరు ఎవరో ఒకరి సాయంతో స్పేర్ టైరు ఎక్కించి, పాత టైరును బస్సులో వెనుక పడేసి.. ‘చూశారా నా ప్రతాపం!’ అన్నట్టు చూసేవాడు. ఆ పూటకు అతనే హీరో! మొత్తానికి ఓ గంట ఆలస్యంగా బస్సు గమ్యస్థానం చేరేది. మా కోసం అక్కడ కచ్చడం ఉండేది, లేదా నడిచి వెళ్లాల్సిందే! ఒక్కోసారి ప్రయాణం వాయిదా పడిన కొద్దీ మా నాన్న ముందే ఉత్తరం రాసి పోస్టు చేయడం వల్ల వరుసగా రెండు మూడు రోజులు ఆ బస్సు వచ్చే టైముకు సవారీ కచ్చడాన్ని పంపేవారు. అలా మారుమూల పల్లెలకు ఆర్టీసీ బస్సులు వచ్చేదాకా అశోకా బస్సులు నడిచేవి. ఇప్పుడు మా అత్తయ్యలు అక్కడ ఉండటం లేదు. మేము అటుగా వెళ్లడమూ లేదు. ఆఖరిగా ఓసారి మా చిన్నత్తకు ఏదో పనుండి ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు.. తనను కారులో డ్రాప్ చేస్తే నలభై నిమిషాలు పట్టింది. ఈ చిన్న ప్రయాణం ఆ రోజుల్లో ఎంత కష్టమయ్యేదో కదా! అనుకున్నాం.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి