అన్నిరంగాల్లో తనదైన ముద్రవేస్తున్న కృత్రిమ మేధ.. మహిళలకూ అండగా నిలుస్తున్నది. కార్యాలయాల్లో వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తున్నది. సమస్యను గుర్తించడం, నిరోధించడంతోపాటు పరిష్కరించడంలోనూ సాయపడుతున్నది.
ఏళ్లకేళ్లుగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కార్యాలయాల్లో మహిళలపై వేధింపులు తగ్గడం లేదు. కౌన్సెలింగ్‌లు, శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ.. ‘వేధింపులు’ నిరంతర సమస్యగా కొనసాగుతున్నాయి. అయితే, ఈ విషయంలో బాధితుల్లో చాలామంది మౌనంగానే ఉండిపోతున్నారు. పరువు పోతుందనీ, కెరీర్ ఇబ్బందిలో పడుతుందని ఫిర్యాదులు చేయడానికి భయపడుతున్నారు. ధైర్యంగా ఫిర్యాదు చేసినా.. న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉండటం లేదు. ఈ సమస్యకు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మంచి పరిష్కారం చూపుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో నెమ్మదిగా, పక్షపాతంగా సాగే మానవ జోక్యంపై ఆధారపడటానికి బదులుగా.. ‘ఏఐ’తో తక్షణ న్యాయం పొందొచ్చని అంటున్నారు.
ఇప్పటికే ఉమ్వెల్ట్.ఏఐ రూపొందించిన ఏఐ ఆధారిత ‘చీఫ్ లైజనింగ్ ఆఫీసర్’ నిక్కీ.. కార్యాలయాల్లో వేధింపులపై నివేదికలు రూపొందిస్తున్నది. ఉద్యోగుల మనోభావాలను విశ్లేషించడంతోపాటు మహిళల అభిప్రాయాలనూ సేకరిస్తుంది. ఈ మెయిల్స్ చెక్ చేయడం, చాట్ సెషన్లను స్కాన్ చేయడం ద్వారా.. ఎవరైనా వేధింపులకు గురవుతున్నారా అని గుర్తిస్తుంది.
వేధింపుల కేసుల్లోని అతిపెద్ద సమస్యలు.. రిపోర్టింగ్, పక్షపాతం. చాలాచోట్ల ఉన్నతోద్యోగులు తనవాళ్లకు అండగా నిలుస్తుంటారు. కానీ, ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్.. ఫిర్యాదులను నిష్పక్షపాతంగా విచారిస్తుంది. లింగం, విభాగం, సీనియారిటీ లాంటి గుర్తింపులను తొలగిస్తుంది. కేసులను వాస్తవాల ఆధారంగా సమీక్షిస్తుంది. తద్వారా బాధితులకు న్యాయం జరుగుతుంది.
ప్రతీకార భయంతో వేధింపులపై ఫిర్యాదు చేయడానికి చాలామంది ముందుకు రావడంలేదు. అయితే, ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్లు.. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతాయి. బాధితులకు కావాల్సిన చట్టపరమైన సలహాలను అందిస్తాయి. వారి మానసిక స్థితి మెరుగుపడేందుకు కావాల్సిన కౌన్సెలింగ్ కూడా ఇప్పిస్తాయి.
మరికొన్ని ఆధునిక ఏఐ వ్యవస్థలు.. ఉద్యోగుల్లో అనుచిత ప్రవర్తననూ గుర్తిస్తున్నాయి. ఇబ్బందికరంగా ప్రవర్తించేవారిపై ఓ కన్నేసి ఉంచుతున్నాయి. అలాంటివారిపై ఫిర్యాదులు అందితే.. తక్షణమే తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి.