విలువలు ఉండవు. వలువలు ఉండీ ఉండవు. షరతులు అస్సలే ఉండవు. చిత్తుగా తాగుతూ.. మత్తుగా ఊగుతూ.. డ్రగ్స్‌లో జోగుతూ.. ఇదీ రేవ్ పార్టీ కల్చర్. డబ్బుపట్టిన మనుషుల ఆగడాలకు ఇది అడ్డా! బహిరంగ సరసాలకు నర్తనశాల. కండ్లు మూసుకుపోయిన బలవంతులు.. తమ వాంఛలు తీర్చుకోవడానికి ఎంచుకున్న అంధకూపం ఈ రేవ్‌పార్టీ. సంబురాల ముసుగులో డ్రగ్స్ రాకెట్లు దూసుకుపోతుంటాయి. సెక్స్ బ్రాకెట్లు నిస్సిగ్గుగా సకిలిస్తుంటాయి. మనదైన సంప్రదాయాలపై, మానవ సంబంధాలపై దాడి చేస్తున్న పెనుభూతమిది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా.. రేవ్‌పార్టీ విశృంఖల విధ్వంసంపై కథనం..
రేవ్ పార్టీల ప్రధాన ఉద్దేశం డ్రగ్స్‌ను అలవాటు చేయడం, అమ్మడం. ఆ పార్టీకి వచ్చిన వారంతా కచ్చితంగా పెడ్లర్ దగ్గర డ్రగ్స్ తీసుకోవాల్సిందే. అలా నెట్వర్క్ పెంచుకుంటూ.. వెళ్లడమే డ్రగ్ పెడ్లర్స్ లక్ష్యం. బాధితుల జీవితం ఏమవుతుందనే బాధ వారికి ఉండదు. డబ్బున్నవారిని మానసికంగా తమ వైపు తెచ్చుకొని డ్రగ్స్‌కు, ఫ్రీ సెక్స్‌కు అలవాటు చేసి బిజినెస్‌ను పెంచుకోవడమే రేవ్ పార్టీ నిర్వాహకుల ప్రధాన లక్ష్యం.
రేవ్‌పార్టీలో ఏముంటుంది.. మహా అయితే తాగుతారు. సరదాగా డ్యాన్స్ చేస్తారు. అంతేగా అనుకుంటారు చాలామంది! అరిషడ్వర్గాలను అధీనంలో ఉంచుకున్న కలి కూడా ఈ పార్టీని చూస్తే.. ఆశ్చర్యపోతాడు. అంత పచ్చిగా ఉంటుంది పార్టీలో వాతావరణం. ఇక్కడ జరిగే తంతు సామాన్యుల ఊహకు అందదు. సూర్యాస్తమయంతో మొదలయ్యే విశృంఖల విన్యాసం మర్నాడు సూర్యోదయం వరకు విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి పార్టీలకు వ్యక్తుల ఎంపిక నుంచి వారు స్వస్థలానికి క్షేమంగా వెళ్లే వరకూ అంతా గోప్యంగా సాగుతుంది. అలాగని ఎవరు పడితే వారు ఈ జోన్లోకి అడుగుపెట్టలేరు. పార్టీకి ఎవరు రావాలనేది నిర్వాహకులు డిసైడ్ చేస్తారు. సెలెబ్రిటీలు, సంపన్నులు, వ్యాపారవేత్తల వారసులు ఇలా డబ్బున్న వారినే డ్రగ్ పెడ్లర్స్ ఆహ్వానిస్తారు.
పార్టీ స్థాయి, అందులో లభ్యమయ్యే సరుకును బట్టి ఎంట్రీ ఫీజు ధర రూ.25 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఎంపిక చేసిన వ్యక్తులనే పార్టీకి పిలుస్తారు. ఇక్కడ ఆడా, మగా భేషజాలు ఉండవు. అందరూ కస్టమర్లే! సదరు వ్యక్తికి ఎలాంటి దురభ్యాసాలూ లేకపోతే.. సిగరెట్‌తో మత్తుప్రాశన చేస్తారు. గంజాతో డోసు పెంచుతారు. డ్రగ్స్ ఇచ్చి వశపరుచుకుంటారు. మగువను ఎగదోసి పూర్తిగా లోబరుచుకుంటారు. అలా డ్రగ్ పెడ్లర్స్ ఉచ్చులో చిక్కుకున్న వాళ్లను సిగ్నల్ యాప్ ద్వారా రేవ్ పార్టీలకు ఆహ్వానిస్తారు. పార్టీ జరిగే చోట సిగ్నల్స్ ఉండవు. ఫోన్లు ఉన్నా పనిచేయవు. కెమెరాలు అస్సలు ఉండవు. పార్టీకి పికప్ పాయింట్ నుంచి డ్రాపింగ్ వరకు నో మొబైల్స్, నో కెమెరా, నో అప్డేట్స్.. అంతా ష్.. గప్‌చుప్. మత్తంతా దిగిన తర్వాత కస్టమర్ కోరిన చోట పదిలంగా దింపుతారు.
రేవ్‌పార్టీల్లో డ్రగ్స్ తర్వాత సెక్స్దే ఆధిపత్యం. ఇక్కడికి వచ్చే కస్టమర్లకు హెచ్ఐవీ టెస్టులు కూడా చేస్తుంటారు. ఒక్కసారి అన్లిమిటెడ్ పార్టీలకు వెళ్లిన తర్వాత ఎవరు.. ఎవరితో సెక్స్‌లో పాల్గొంటారో వారికే తెలియదు. పశుత్వం కట్టలు తెంచుకుంటుంది. పార్ట్నర్స్ను మార్చుకుంటూ.. దిగజారుతుంటారు. ఈ తరహా రేవ్పార్టీలకు హాజరయ్యేవారిలో ఆడవాళ్ల శాతమూ ఎక్కువే! వీరిలో కొందరు డబ్బుల కోసం వస్తే.. మరికొందరు డ్రగ్స్ కోసం ఉచ్చులో చిక్కుతారు. కొందరు పార్టీకి ముందే సెక్స్ పార్ట్నర్ను ఎంచుకుంటే.. మరికొందరు పార్టీకి వచ్చిన తర్వాత నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటారు. ఒక్కసారి పార్టీ మొదలయ్యాక మనుషులు మృగాలుగా మారిపోతారు. అక్కడ తాగుబోతులే బెటర్ అనిపిస్తుంది. డ్రగ్స్ కావాలనుకునేవాళ్లు ఒక చోట చేరుతారు. శృంగారం కావాలనుకువాళ్లు మరో జోన్లోకి ప్రవేశిస్తారు. విచ్చలవిడి సెక్స్ కావాలని తపించేవారు ఇంకో గూటికి చేరుకుంటారు. అక్కడ గంటల తరబడి మృగత్వం రాజ్యమేలుతుంది. ఒక్కోసారి రోజుల తరబడి
కొనసాగుతుంది.
పార్టీకి వచ్చినవారిని సంతృప్తిపరచడానికి నాణ్యమైన డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు పెడ్లర్స్. అంతేకాదు, వారిని పూర్తిగా గ్రిప్‌లో ఉంచుకునేలా అందమైన అతివలను వలగా విసురుతారు. ఇలాంటివారికి ఎంట్రీ ఫ్రీ! వయసులో ఉన్న ఆడపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసి, వాటి ఆశచూపి అంగడి సరుకుగా మార్చేస్తుంటారు. డ్రగ్స్ కోసం ఉద్యోగాలు వదిలేసే టెకీలు కొందరైతే.. అవి దొరక్క ఆత్మహత్యకు పాల్పడినవాళ్లూ ఉన్నారు. మొదట డబ్బు కోసం డ్రగ్స్ పార్టీలకు వెళ్లిన యువతులు.. ఆ మత్తులో ఉన్నదంతా పోగొట్టుకొని, సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని ఓ బాధితురాలి ఆవేదన.
రేవ్‌పార్టీల్లో దొరికిన వారిని బాధితులుగానే పోలీసులు చూస్తున్నారు. రెండ్రోజులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. నిర్వాహకులను, డ్రగ్ సప్లయర్స్‌ను అరెస్టు చేస్తున్నారు. పోలీసుల కౌన్సెలింగ్ తీసుకున్న వాళ్లు.. నాలుగు రోజులు కాగానే షరామామూలుగా తర్వాత పార్టీ ఎక్కడుందో సెర్చ్ చేస్తున్నారు. ఇలాంటి పార్టీల్లో పాల్గొన్నవారిని కూడా శిక్షించేలా చట్టాలు చేస్తేగానీ మార్పు రాదని బాధితులే చెబుతున్నారు. ఆ నరకం నుంచి బయటపడటానికి తనకు రెండేండ్ల సమయం పట్టిందని ఓ బాధితురాలు చెప్పుకొచ్చింది. వారం వారం సాగే ఈ పాడు పార్టీలపై ఏడాదికి ఒకటి రెండుసార్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే ఏం ప్రయోజనం అని ఆమె ప్రశ్నిస్తున్నది. పార్టీ కల్చర్ ముసుగులో వికృత ఆనందం పొందుతూ, సమాజాన్ని పీడిస్తున్న వాళ్లు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరం. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే భవిష్యత్తులో ప్రతి వీధిలో ఓ రేవ్‌పార్టీ అడ్డా పుట్టుకొస్తుంది. మాదకద్రవ్యాలకు ఓ తరమంతా నిర్వీర్యమవుతుంది. తల్లిదండ్రులూ బీ కేర్‌ఫుల్. టీనేజ్ పిల్లలను పట్టుదలగా నియంత్రిస్తే బాగోదు అనుకుంటే… ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవ్వొచ్చు. పిల్లలకు స్వేచ్ఛనిచ్చినా, వారిపై ఓ కన్నేసి ఉంచడం మీ బాధ్యత అని మర్చిపోకండి.
– రవికుమార్ తోటపల్లి