బోరింగ్ లైఫ్.. సాదాసీదాగా గడిచిపోతున్నదని చింతిస్తున్నారా! ఇల్లు.. పిల్లలు.. ట్రాఫిక్‌లో హారన్లు, ఆఫీస్ పంచింగ్లు.. జీవితం ఇలా రొడ్డకొట్టుడు వ్యవహారంలా మారిపోయిందని ఫీలవుతున్నారా! మీరు ఇలా భావిస్తున్నారూ అంటే.. జీవించడం లేదు, ఏదో బతికేస్తున్నారన్న మాట. కేవలం జీతం కోసం ఉద్యోగం చేస్తే.. కొలువు ఎంత కఠినంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అలాగే లైఫ్ కూడా! నిస్సారంగా రోజులు గడిపేస్తే మజా ఉండదు సరికదా జీవితం భారంగా మారిపోతుంది. అతివ అయినంత మాత్రాన రొటీన్ లైఫ్ మాత్రమే గడపాలన్న రూల్ ఎక్కడుంది? వాళ్లకూ ఇష్టంగా జీవించే హక్కు ఉంది కదా! మీ లైఫ్ నిస్తేజంగా మారొద్దంటే… జీవితానికి కొత్త కిక్ ఇవ్వాలి. అదెలాగంటారా? ఇదిగో ఇలా ప్రయత్నించండి.. ఇష్టంగా జీవించండి! ఎందుకంటే జిందగీ న మిలేగా దుబారా..!!
చదువో.. ఉద్యోగమో.. ఏం చేసినా.. మీ ఇష్టాలను, అభిరుచులను వదిలిపెట్టాలని లేదు. చాలామంది ఆఫీసు, ఇల్లు ఈ రెండిటి గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. ఒక లైన్ గీసుకుంటారు. వేరే ఆలోచనలేం చేయకుండా యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోతారు. ఇది ఎంత మాత్రం సరికాదు. ఏ కాస్త సమయం చిక్కినా మీకిష్టమైన వ్యాపకాలను ఎంచుకోవాలి. ఉదాహరణకు నచ్చిన పుస్తకాలు చదవండి. వాటిలో స్ఫూర్తినిచ్చే వాక్యాలను ఒకచోట రాసుకోండి. సమయం దొరికినప్పుడు వాటిని మళ్లీ మళ్లీ చదువుకోవచ్చు. నచ్చిన పాటలను వినండి. ఓ మంచి రీల్ చేయండి! మీకు కవితలు, కథలు రాయాలనే కోరిక ఉంటే ప్రయత్నించండి. వాటిని మీ స్నేహితులకు, కుటుంబసభ్యులకు చూపించండి. చదివినవాళ్లు ‘బాగాలేదు’ అన్నంత మాత్రాన చిన్నబుచ్చుకోకండి, మీ ప్రయత్నం ఆపకండి. సినిమాలు చూడటం ఇష్టమైతే… చూసి ఆనందించండి. ఆ చిత్రం గురించి మిత్రులతో చర్చించండి. చిన్ననాటి స్నేహితులతో కలిసి అప్పడప్పుడూ విహారయాత్రలకు వెళ్లండి. ఇలా మీ సంతోషాన్ని రెట్టింపు చేసే ఏ ప్రయత్నాన్నీ వదిలిపెట్టకండి. ఫైనల్‌గా.. మన చుట్టూ గీత గీసుకుంటే ముందు కంఫర్ట్‌గానే ఉంటుంది. కానీ, కొంత కాలానికి అదే అన్‌కంఫర్ట్ జోన్‌గా మారిపోతుంది. కిక్ ఉండదు. అంతా కామన్‌గా అనిపిస్తుంది. గీతను చెరిపేస్తే చాలు.. ఫ్రెష్ లైఫ్ లోపలికి వస్తుంది.
ఏకాంతంగా మీతో మీరు కాసేపు గడపండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఇతరులను ప్రేమించడం, వాళ్లు కాదంటే విచారంలో మునిగిపోవడం నాన్నల జమానా సంగతి. మిమ్మల్ని మీరు ప్రేమించుకొని చూడండి. మీతో మీరు ఎంత సంతోషంగా ఉండగలరో గమనించండి. మీకంటూ కొంత సమయాన్ని వెచ్చించండి. ఆ టైమ్‌లో మీ మనసు, ఆలోచనల నిండా మీరు మాత్రమే ఉండాలి. కుటుంబం, ఆఫీసు, స్నేహితులు, బంధువులు… ఎవరినీ ఆ ఆలోచనల్లోకి రానీయకండి. మీ ఆరోగ్యం, అభిరుచులు, ఆనందం కోసం ఇంకా ఏమేం చేయచ్చో ఆలోచించండి. ఏకాంతంగా కాసేపు గడిపితే మీ గురించి మీరు మరింత శ్రద్ధ తీసుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరిగితే.. అందరితోనూ త్వరగా కలిసిపోగలుగుతారు. చెప్పొచ్చేదేంటంటే.. ఎవరో మిమ్మల్ని ఇష్టపడటం ఏంటి? బ్రేక్ ఇట్! మిమ్మల్ని మీరే ప్రేమించండి. ఒక్కరే ఓ రైడ్‌కి వెళ్లండి. ఏ నది ఒడ్డునో… సెలయేటి చెంతనో కాలం గడపండి. అందిపుచ్చుకున్న స్వేచ్ఛ.. స్వచ్ఛమైన చిరునవ్వును మీకు కానుకగా అందిస్తుంది.
ఏ కాస్త సమయం దొరికినా దాన్ని వృథా పోనీయకుండా ఒడిసిపట్టండి. మీ ఇంటికి ఆఫీసుకు మధ్య ఎక్కువ దూరం ఉంటే ఆ డ్రైవ్‌కి ఓ పోడ్‌కాస్ట్‌ని పెట్టేయండి. లేదంటే.. కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్లు చూస్తూ ఒత్తిడిని చిత్తు చేయండి. మీకిష్టమైన పాత సినిమాలను యూట్యూబ్‌లో చూస్తూ ఆనందించండి. సంతోషాన్ని వెతుక్కునే ఓపిక ఉండాలికానీ దానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. సో.. ప్రయాణంలోనూ ఇంటి పనులు, ఆఫీస్ టెన్షన్ల గురించి కాకుండా.. ఆ సమయాన్ని వినోదాత్మకంగా, విజ్ఞానాత్మకంగా మలుచుకునే ప్రయత్నం చేయండి. విషయమేంటంటే.. కాలం చాలా విలువైందని పొదువు చేయొద్దు, ఫుల్‌గా వాడేయాలి. ప్రతి నిమిషాల్ని ఆస్వాదించాలి. డబ్బును పొదుపు చేస్తే లాభం కానీ, కాలాన్ని మాత్రం తనివితీరా అనుభవించాల్సిందే!
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్.. వెబ్‌సిరీస్‌లు ఓకే… అప్పుడప్పుడు కిటికీలోంచి బయటికి చూడండి. ఓ విశాలమైన విశ్వం ఉంది. వస్తువులు, మనుషులనే కాదు ప్రకృతినీ ప్రేమించే మనసు మనకు ఉండాలి. ఉదయించే సూర్యుణ్ని చూసి మైమరిచిపోవాలి. కురిసే వానలో మనసునూ తడవనివ్వాలి. ఎదిగే మొక్కను, విచ్చుకునే మొగ్గను అపురూపంగా చూడాలి. జంతువులు, పక్షులను నిశితంగా పరిశీలించాలి. మాటలకు అందని వాటి ప్రేమతో మీ మనసు ఆనందంతో పులకిస్తుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకునే వాళ్లకు ప్రకృతిని మించిన ఖజానా ఎక్కడా ఉండదు. అది మీకు అంతులేని ఆనందాన్ని పంచుతుంది, పెంచుతుంది కూడా.
స్ట్రెస్ అనిపిస్తే.. వీకెండ్ మస్తీ కోసం ఎదురుచూడటం.. వ్యసనాలకు దగ్గర కావడం.. అందుకోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం! అయితే అభిరుచులు మనిషిని వ్యసనాలకు దూరం చేస్తాయి. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీ అభిరుచులకు మెరుగుపెడితే దారితప్పకుండా ఉండొచ్చు. క్షణం తీరికలేని ప్రముఖులు కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం అభిరుచులను ఆశ్రయిస్తుంటారు. అలాగే స్ట్రెస్ బస్టర్‌గా వంటింట్లో ప్రయోగాలు చేసే ప్రముఖులూ ఎంతోమంది ఉన్నారు.