అపార్ట్మెంట్ జీవనశైలి పెరిగాక మొక్కలు కూడా ఇంట్లోకే వచ్చేశాయి. దాంతో ఇంటివారు వాటిని సాధ్యమైనంత అందంగా కనిపించేలా అమర్చుకుంటున్నారు. చక్కని కుండీలను జతచేసి పూల మొక్కలు, క్రోటన్లలాంటివి పెంచుతున్నారు. అయితే పెట్టిన గదికి ఓ ప్రత్యేక ఆకర్షణగా ఇవి కనిపించాలంటే పరిమాణంలో కాస్త పెద్దగా ఉండే రకాలు ఎంచుకోవాలని చెబుతున్నారు గృహాలంకరణ నిపుణులు. అందుకోసం ఏయే మొక్కలు బాగుంటాయో కూడా సూచిస్తున్నారు.
ఇంట్లో ఏ గదిలో పెట్టినా ముచ్చటగా కనిపించే వాటిలో కార్న్ప్లాంట్ కూడా ఒకటి. గణుపుల కాండంతో ఉండే వీటి ఆకులు పల్చగా పొడవుగా రేకల్లా పెరుగుతూ ఉంటాయి. ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఆయా గణుపుల నుంచీ ఆకులు వస్తుంటాయి. సోఫా పక్కన లేదా గదిలో మంచం దగ్గర… ఇలా ఎక్కడ ఉంచినా ఆ చోటుకి మంచి లుక్‌ని తెస్తుందీ మొక్క.
పొడవాటి కాండంతో దానిపైన మరింత పొడవైన కొమ్మలతో, వెడల్పాటి ఆకులతో పెరిగే చెట్టు ఫిడెల్ లీఫ్ ఫిగ్. దీనికి ఎండ ఎక్కువగా కావాలి. నీళ్లు కూడా సమయానికి పోయాలి. అయితే దీని నిర్మాణం, ఆకుల ఆకృతిల వల్ల గదిలో ఏ మూల పెట్టినా అక్కడ ఐకాన్‌లా కనిపిస్తుంటుంది.
మందపాటి మెరిసే ఆకులతో ఉండే రబ్బర్ మొక్క కూడా ఇంటి అలంకరణకు చక్కగా ఉపయోపడుతుంది. ఎత్తుగా వెడల్పాటి ఆకులతో పెరిగే ఇది, గదికి బోల్డ్ స్టేట్‌మెంట్‌లా కనిపిస్తుంది. అంతేకాదు, గాలిని శుద్ధి చేసేందుకూ పనిచేస్తుంది.
సన్నటి పొడవాటి కొబ్బరి, ఈత చెట్ల తరహా ఆకుల నిర్మాణంతో ఉంటుంది అరేకా పామ్. దీన్ని పక్కల నుంచి కత్తిరిస్తూ ఉంటే ఎత్తుగా పెరుగుతూ అందమైన కొమ్మలను ఏర్పర్చుకుని గదికి ఆకర్షణగా మారుతుంది. పెద్దగా ఎండ తగలకపోయినా చక్కగా బతికేస్తుంది.