అరటి పండు గురించి తొక్క ఒలిచి పెట్టినట్టు వివరించాల్సిన అవసరం లేదు. కానీ, అరటిపండు అంటే పసుపు రంగులో ఉండే పండు అని స్థిరపడిపోయిన భావన ఇప్పుడు మారిపోతున్నది. మార్కెట్లో పసుపు రంగులో ఉండే అరటిపళ్ల పక్కన లేత ఎరుపు రంగువీ కనిపిస్తున్నాయి. ఆరోగ్య ప్రయోజనాల కోసం అరటిపండు తినాలంటారు. ఇది వినడానికి బాగానే ఉన్నా కొనడానికి కొంచెం కష్టంగా ఉంటున్నది. ఎందుకంటే? ఆ ఆరోగ్య ప్రయోజనాలు పసుపు రంగు పండు తింటే దక్కుతాయో? ఎరుపు రంగు పండు తింటే వస్తాయో తెలియట్లేదు.
ఈ సందేహాన్ని పోషకాహార నిపుణుల్ని నివృత్తి చేయమని అడిగితే.. రెండు రకాలూ పోషకాల గనులే అని చెబుతున్నారు. అయితే, ఎరుపు రంగు అరటిపండులో పోషకాలు కాస్త ఎక్కువగా ఉంటాయని సెలవిస్తున్నారు. అయితే, ఈ రెడ్ బనానాలు హైబ్రిడ్ బాపతని కొందరి అపోహ! కొత్తరంగును చూసి హైబ్రిడ్ అనుకోవద్దని చెబుతున్నారు.
ఈ రెడ్ బనానాలో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. తియ్యదనం కలిగించే ైగ్లెసిమిక్ ఇండెక్స్ (జీఐ) మాత్రం తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ రోగులకు, ఊబకాయులు ఎరుపు రంగు అరటిపళ్లు ఎంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ బీ6, మెగ్నీషియం, బీటా కెరోటినాయిడ్లు కూడా ఇందులో అధికంగానే ఉంటాయట!