ఈతరానికి ఓ ప్రత్యేకత ఉంది. చదువుతో పాటు ఏదో ఒక ఆసక్తిని ప్రవృత్తిగా మార్చుకోగల తెలివి అపారం. చదువు పూర్తయ్యాక ఆ ప్రవృత్తినే వృత్తిగా మార్చుకొనే ధైర్యమూ ఎక్కువే. అందుకు ఉదాహరణ చెన్నైకి చెందిన కిరణ్మయి వీరమణి. కిరణ్మయికి చిన్నప్పటి నుంచీ ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఐదో తరగతిలోనే ఓ బర్త్డే పార్టీని కవర్ చేసింది. కాలేజీలో చేరాక ఫొటోగ్రఫీ క్లబ్ సభ్యురాలిగా తన కళకు మెరుగులు దిద్దుకుంది.
హాస్టల్ జీవితం మొదలు పరిసరాల్లో కనిపించే పక్షుల వరకూ ప్రతి దృశ్యాన్నీ, సందర్భాన్నీ ఓ రంగుల కావ్యంగా మలచగలిగింది. గోథె ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ అనే సంస్థ శ్రీలంకలోని తమిళుల జీవితాలపై ఓ ప్రాజెక్ట్ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు… కిరణ్మయి తన అభ్యర్థన పంపింది. ఆమె ప్రతిభను గుర్తించి శ్రీలంకకు పంపారు ఎన్జీవో ప్రతినిధులు. సుదీర్ఘమైన అంతర్యుద్ధాన్ని తట్టుకుని నిలబడిన తమిళుల బతుకు కథల్ని తన కెమెరాలో బంధించింది కిరణ్మయి. ఆ తర్వాత కూడా భిన్నమైన ఇతివృత్తాలతో ప్రాజెక్టులు చేస్తున్నది.