అన్నిటా మిన్నగా వినిపిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు.. కాబోయే అమ్మలు, పుట్టబోయే బిడ్డల కోసం పనిచేయనున్నది. ఐటీలో అగ్రగామి, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు నగరం ఇందుకు వేదిక అవుతున్నది. మాతాశిశు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా బెంగళూరు మహా నగర పాలక సంస్థ ఆరోగ్య విభాగం ‘ఏఐ’ సాయం తీసుకుంటున్నది.
‘సేవ్మామ్’ పేరుతో ఏఐ ఆధారిత పైలట్ ప్రాజెక్టు ఇటీవలే ప్రారంభమైంది. దీని ద్వారా నగరంలోని గర్భిణులు, నవజాత శిశువులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది. సురక్షితమైన ప్రసవాలు జరిగేలా చూసుకోవడానికి ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 300 మంది గర్భిణులు పేర్లను నమోదు చేసుకోగా.. వీరిలో 15 మంది హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నవారిని గుర్తించారు.
వీరికి పూసల దండలను పోలిన ఏఐ ఆధారిత స్మార్ట్ గ్యాడ్జెట్లను అందించనున్నారు. ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లు స్థానిక ఆశా కార్యకర్తలు మొదలుకొని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ క్లినిక్లతో అనుసంధానమై ఉంటాయి. ఇవి ప్రసవం అయ్యేవరకూ గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తాయి. వారు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాలో, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో చెబుతాయి.
పరీక్షల ఫలితాలను కూడా ట్రాక్ చేస్తాయి. ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు స్థానిక ఆశా కార్యకర్తలు, వైద్యాధికారులకు సందేశాలు పంపుతాయి. ఇలా.. గర్భిణులతోపాటు వారికి పుట్టిన శిశువుల సంరక్షణ కోసం వెయ్యి రోజులపాటు ఫాలోఅప్ సేవలు అందిస్తాయి. డెలివరీ తర్వాత కూడా.. శిశువులను మానిటర్ చేస్తూ, ఎప్పుడెప్పుడు టీకాలు వేయించాలో కూడా చెబుతాయి. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తే.. మరింత విస్తృతంగా ఉపయోగించే యోచనలో ఉన్నారు అధికారులు.