ప్రతి ఏడాదికి ఓ అధికారిక రంగు. ఆ రంగుకు తనదైన హంగు. మూడువందల అరవై ఆరు రోజులూ (లీపు సంవత్సరం) ఆ వర్ణానిదే ఆధిపత్యం. డిజైనర్లు ఆ వన్నెకే ఓటేస్తారు. మాడల్స్ ఆ రంగు కోకలు చుట్టుకుని సీతాకోక చిలుకల్లా మెరిసిపోతారు. సౌందర్య ప్రియుల వార్డ్రోబ్ రాత్రికి రాత్రే.. పాత రంగుల్ని వదిలించుకుంటుంది.
పీచ్ ఫిజ్ వర్ణపు చీరలు, బ్లౌజ్‌లు, స్కర్ట్లు.. సగర్వంగా వచ్చి చేరతాయి. ఆభరణాల తయారీ సంస్థలు కూడా ఈ ఏటి మేటి రంగును నగలలో ఎలా జోడించాలా అని బుర్ర బద్దలుకొట్టుకుంటారు. ఆ లెక్కన ఈ ఏడాది పీచ్ ఫిజ్ రంగుదే రాజ్యం. ఈ రాచ వన్నె ఆశావాదం, సృజనాత్మకత మోసుకొస్తుందని వర్ణ విశ్లేషకుల నమ్మకం.