ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధులలో బ్రెస్ట్‌క్యాన్సర్ ముందు వరుసలో ఉన్నది. ఏటా 32 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే, రోజూ 30 నిమిషాలపాటు చేసే తీవ్రమైన వ్యాయామం.. బ్రెస్ట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకూ తగ్గించగలదని ఇటీవలి అధ్యయనం తేల్చింది. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా రెసిస్టెన్స్ ట్రైనింగ్, హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వ్యాయామాలు.. కణాల స్థాయిలో క్యాన్సర్‌తో పోరాడటానికి సాయపడతాయని తేల్చారు.
ఈ రెండు రకాల తీవ్రమైన వ్యాయామాలు.. ‘మయోకిన్స్’ అని పిలిచే కండరాల ప్రొటీన్ల విడుదలను ప్రేరేపిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ మయోకిన్స్.. రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకు నెమ్మదిస్తుందని చెబుతున్నారు. పరిశోధనలో భాగంగా.. 32 మంది బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులను ఎంచుకున్నారు. వీరితో రెగ్యులర్‌గా రెండు రకాల వ్యాయామాలను చేయించారు.
వ్యాయామానికి ముందు, వ్యాయామం పూర్తయిన వెంటనే, వ్యాయామానికి 30 నిమిషాల తర్వాత రక్త నమూనాలను పరిశీలించారు. ఆసక్తికరంగా వ్యాయామం తర్వాత రోగుల్లో క్యాన్సర్ నిరోధక మయోకిన్‌ల పెరుగుదల కనిపించినట్లు పరిశోధకులు వెల్లడించారు. క్యాన్సర్ కణాల పెరుగుదల 19 నుంచి 29 శాతానికి తగ్గినట్లు చెప్పుకొచ్చారు. రెసిస్టెన్స్ ట్రైనింగ్, హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ లాంటి తీవ్రమైన వ్యాయామాలతో బ్రెస్ట్ క్యాన్సర్‌కు కళ్లెం వేయొచ్చని చెబుతున్నారు.