ఎండకాలంలో చల్లటి నీళ్లు తాగడానికి కుండ ప్రకృతిసిద్ధమైన పరిష్కారం. ఫ్రిజ్లు ఉన్నప్పటికీ వేసవిలో కుండలకు గిరాకీ ఎక్కువే ఉంటుంది. పైగా కరెంట్ వాడకుండానే నీళ్లు చల్లబడిపోతాయి. మట్టిలో ఉండే మినరల్సూ నీళ్లలో చేరిపోతాయి. అలా కుండ నీళ్లు ఆరోగ్యకరం కూడా. అయితే, దీని వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కుండ కొన్న తర్వాత మొదటిసారి ఉపయోగానికి ముందు బాగా కడగాలి. మట్టికుండలు పొరలు పొరలుగా ఉంటాయి. కాబట్టి, వాటిని నిల్వచేయడం, రవాణా చేసే క్రమంలో దుమ్ము, బ్యాక్టీరియాల్లాంటివి పేరుకుని ఉండే అవకాశం ఉంది.
కుండకు సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా గాలి ప్రసరించి నీళ్లను చల్లబరుస్తుంది. అయితే, రంధ్రాల ద్వారా దుమ్ము, కీటకాలు, బ్యాక్టీరియా లాంటివి ప్రవేశించే వీలుంది. కాబట్టి కుండను మూసి ఉంచాలి.
కుండలోపల తడిగా ఉంటుంది కాబట్టి, ఎప్పటికప్పుడు నీళ్లు మారుస్తూ ఉండకపోతే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.
కుండను నేరుగా నేలపైనే ఉంచకూడదు. నేల సరిగ్గా లేకపోతే కుండ పగిలిపోవచ్చు. పైగా కుండలో నీళ్లు నేలమీద ఉండే దుమ్ము, బ్యాక్టీరియాతో కలుషితం కావొచ్చు.