అన్నిరంగాల్లో అడుగుపెట్టిన కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ‘ఫ్యాషన్’కూ విస్తరించింది. ‘Slayrobe’ పేరుతో ఫ్యాషన్ ప్రపంచంలో ఓ సరికొత్త సాంకేతికత వచ్చి చేరింది. ఎవరికి ఎలాంటి ఔట్ఫిట్స్ సూటవుతాయో.. ఏ రంగు డ్రెస్సులు నప్పుతాయో ఈ యాప్ ఇట్టే చెప్పేస్తుంది. వార్డ్రోబ్ నిర్వహణ మొదలుకొని.. మీకే ప్రత్యేకమైన ఫ్యాషన్‌నూ అందిస్తుంది.
ఆన్లైన్లో షాపింగ్ చేయడం ఇప్పుడు సాధారణ విషయమే! కానీ, అక్కడ వేల సంఖ్యలో ఉత్పత్తులు దర్శనమిస్తాయి. అందులో ఏది ఎంచుకోవాలో.. మీకు ఏది సూటవుతుందో తెలుసుకోవడానికే గంటలుగంటలు పడుతుంది. కానీ, ఏఐ ఆధారత స్లేరోబ్.. ఆ శ్రమను తగ్గిస్తుంది. ఇందులోని ప్రత్యేక అల్గారిథం.. స్టయిలింగ్ లాజిక్, కలర్ సైన్స్, అప్పియరెన్స్ సైకాలజీ, ఫ్యాషన్ ఇంటెలిజెన్స్.. అన్నిటినీ మేళవించి పనిచేస్తుంది.
ఇందులో లాగిన్ అయిన తర్వాత.. మీ ఎత్తు, రంగు మొదలుకొని కొన్ని వివరాలను నమోదుచేస్తే చాలు. వాటిని విశ్లేషించి.. మీ ఔట్‌ఫిట్‌కు సరిపోయే దుస్తులను సిఫారసు చేస్తుంది. కొత్తవాటి విషయంలోనే కాదు.. పాత దుస్తులను కూడా ఎలా ఉపయోగించుకోవాలో చెబుతుంది. ఇందుకోసం మీ వార్డ్‌రోబ్‌లోని దుస్తులు, ఇతర యాక్సెసరీస్‌ను ఫొటోలు తీసి.. ఇందులో అప్లోడ్ చేయాలి. వాటిలో దేనికేది జత చేస్తే బాగుంటుందో చూపిస్తుంది. ఒకవేళ మ్యాచింగ్ సరిగ్గా లేకుంటే.. మీరు మళ్లీ షాపింగ్‌కు వెళ్లినప్పుడు పాత వాటికి సరిపోయే వాటిని సూచిస్తుంది. అలా.. మీ బడ్జెట్‌కూ భరోసా ఇస్తుంది.