నాజూకైన శరీరాకృతి కోసం ఇవాల్టి యువత అనేక పాట్లు పడుతోంది. ఆహారం తీసుకోవడం మొదలుకొని వ్యాయామాలు చేయడం వరకు కఠిన కసరత్తులే చేస్తున్నారు. నిజానికి శరీరం బరువు తగ్గించుకోవడం ఒక సవాల్. వ్యాయామం చేస్తూ క్యాలరీలను నియంత్రిస్తుంటారు. అయితే ఆహారంలో మార్పులు చేసుకునేటప్పుడు ఎలాంటివి తీసుకోవాలనేది పెద్ద ప్రశ్నగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో కూరగాయలు, పండ్లు, తక్కువగా వేయించినవి, నూనె పదార్థాలు తినొచ్చా? అనే సందేహాలు ఎందరినో తొలుస్తుంటాయి. ఈ నేపథ్యంలో శరీరం బరువును తగ్గించుకునేందుకు 7 అద్భుత డిష్‌ల గురించి తెలుసుకుందాం.
దోరగా వేయించిన కూరగాయలు
కూరగాయ ముక్కలను దోరగా వేయించి తీసుకోవడం చాలా మంచిది. వీటిలో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. కొంచెం తీసుకోగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. వీటిని వేయించే సమయంలో కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలను చేరిస్తే మరింత రుచిగాఉంటుంది. ఒక ప్లేట్ వేయించిన కూరగాయల ముక్కలు చాలా సేపటి వరకు మనకు ఆకలి కాకుండా చూస్తాయి.
రోస్టెడ్ కాలీఫ్లవర్
కాలీఫ్లవర్గా పిలుచుకునే గోబీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కాలీఫ్లవర్‌ను పేనంపై రోస్ట్ చేసుకుని తినడం వల్ల తొందరగా కడుపు నిండిపోతుంది. దీనికి వెల్లుల్లి, పెరుగు కలిపిన చట్నీతో తీసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుంది.
స్క్రాంబల్డ్ ఎగ్స్
గుడ్లను గిలక్కొటి చేసుకున్న ఆహారాన్ని నిత్యం తీసుకోవడం శరీరానికి మంచి ప్రోటీన్లను అందిస్తుంది. ఆహారం తయారీకి ఇది చాలా సులభమైనది. ఆరోగ్యకరమైనది. కోడి గుడ్లను గిలక్కొట్టి చిరుతిండిని తయారుచేసుకునేందుకు మిరియాలు, పాలు, వెన్న మాత్రమే అవసరమవుతాయి. వీటిని కలపడం ద్వారా ఈ ఆహారం మరింత పోషకంగా మారుతుంది. కొన్ని కూరగాయలను కలిపి కూడా తీసుకోవచ్చు.
బేక్డ్ చికెన్ సీక్
ముఘలాయి రకం వంటకంగా బేక్డ్ చికెన్‌ను సీక్గా తయారుచేసుకుని తింటే చాలా బలవర్ధకం. ఈ ఆహారంలో తక్కువ క్యాలరీలు.. ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు అందుతాయి. చికెన్‌ను కాల్చినప్పుడు క్యాలరీలు తరిగిపోతాయి. నూనె వాడకుండా నిప్పులపై కాల్చి తినడం ద్వారా నాన్‌వెజ్ తినాలన్న కోరికను తీర్చుకోవడంతో పాటు శరీరం బరువును అదుపులో పెట్టుకోవచ్చు.
మొలకల చాట్
మొలకెత్తిన విత్తనాలు శరీరం ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి తక్కువ సమయంలో తయారుచేసుకోవడంతోపాటు సులభంగా చేసుకోవచ్చు. రాజ్మా, పెసర్లు, శెనగలను గిన్నొలో పోసి నీటితో నింపి నానబెట్టాలి. 8 గంటల తర్వాత వీటిని చాట్ మాదిరిగా లేదా ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. వీటికి సుగంధ ద్రవ్యాలు, నిమ్మరసం కలిపి వంటకం సిద్ధం చేయడం వల్ల మరింత రుచి అందుతుంది. మొలకెత్తిన విత్తనాల్లో ప్రోటీన్లు ఎక్కువగా లభించి కొన్ని తినగానే కడుపు నిండిపోతుంది. ఇవి జీర్ణం కావడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నందున మళ్లీ మళ్లీ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
మెక్సికన్ క్వినోవా సలాడ్
క్వినోవాలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఫాక్స్‌టైల్, కిడ్నీ బీన్స్, దోరగా వేయించిన కూరగాయ ముక్కలతో కలిపి ఆహారంగా తీసుకోవచ్చు. నిమ్మరసం, కొత్తిమీర కలపడం అదనపు రుచిని అందిస్తాయి.ఈ సలాడ్ సున్నితమైన, సూక్ష్మమైన రుచిని కలిగి ఉంటుంది. రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ప్రోటీన్లు పుష్కలంగా లభించడం ద్వారా ఎక్కువ సేపు ఆకలి కలుగకుండా ఉండగలుగుతాం.
సోయా ఉత్తప్పమ్
సోయా రేకులతో తయారుచేసుకునే సోయా ఉత్తప్పమ్ వంటకంలో తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. ఈ ఉత్తప్పమ్ను సూజీ పిండితో కూడా తయారుచేసుకోవచ్చు. కరకరలాడేలా ఉండే ఈ వంటకం ఎంతో రుచిగా కూడా ఉంటుంది. దీనిని వివిధ కూరగాయల ముక్కలు కలుపుకుని కూడా తీసుకోవచ్చు.