ఆన్లైన్లో తాము సురక్షితంగానే ఉన్నట్లు.. 46 శాతం మంది భారతీయ మహిళలు చెబుతున్నారు. ‘షీ శక్తి సురక్ష సర్వే-2025’లో భాగంగా.. ఆన్లైన్ భద్రత గురించి మహిళల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 46 శాతం మంది తాము ఆన్లైన్లో భద్రంగానే ఉన్నట్లు చెప్పగా.. 17 శాతం మంది ఆన్లైన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. 38 శాతం మంది తటస్థంగా ఉన్నారు. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 20 నగరాల్లోని 8,000 మంది నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. నగరానికి 400 మంది చొప్పున కంప్యూటర్-అసిస్టెడ్ టెలిఫోన్ ఇంటర్వ్యూయింగ్ ద్వారా డేటాను సేకరించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ భద్రతకు సంబంధించి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు.. ఇతర విషయాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
ఇందులో భాగంగా ఆన్లైన్ భద్రతా చర్యలపై మహిళల్లో విశ్వాసం ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. గతంతో పోలిస్తే ఆన్లైన్ సెక్యూరిటీపై 47 శాతం మంది నమ్మకం వ్యక్తంచేశారు. ఇందుకోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తున్నప్పటికీ.. వాటి ప్రభావంపై ఇంకా నమ్మకంగా కలగడం లేదని 17 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు సఫలమైనట్లు 32 శాతం మంది చెప్పగా.. 30 శాతం మంది అసంతృప్తి వ్యక్తంచేశారు.