శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 18, 2020 , 23:36:04

‘పట్టణ ప్రగతి’పై సీఎం దిశానిర్దేశం

 ‘పట్టణ ప్రగతి’పై సీఎం దిశానిర్దేశం

పల్లె ప్రగతి విజయస్ఫూర్తితో పట్టణ ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి మున్సిపల్‌ సదస్సు నిర్వహించారు.

  • మూడు నెలల్లోగా మరుగుదొడ్ల నిర్మాణానికి గడువు
  • ఐదు నెలల్లో కరెంటు సమస్యలు పరిష్కారం కావాలి..
  • ఆరు నెలల్లో పట్టణ రూపురేఖలు మారాలి
  • హాజరైన కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా, అదనపు కలెక్టర్‌ రాంబాబు ఎమ్మెల్యే కోనప్ప, చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌

పల్లె ప్రగతి విజయస్ఫూర్తితో పట్టణ ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి మున్సిపల్‌ సదస్సు నిర్వహించారు. ఈ నెల 24వ తేదీ నుంచి మార్చి 4 వరకు నిర్వహించే పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరెంటు, మరుగుదొడ్ల సమస్యలు తీరి ఆరు నెలల్లో పట్టణ రూపురేఖలు మారిపోవాలని పేర్కొన్నారు.  

- నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ


నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి/ కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లె ప్రగతిని స్ఫూర్తిగా తీసుకుని.. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చే యాలని సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణపై మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించా రు. ఈ నెల 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహిం చే పట్టణ ప్రగతి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులు చేపట్టాల్సిన వాటిపై సీఎం సూచనలు చేశారు. పేదలు ఎక్కువగా ఉండే దళితవాడల నుంచి పాదయాత్రలు, కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వార్డులవారీగా పట్టణ ప్రగతి ప్రణాళికలు తయారు చేసుకుని.. అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పారు. మూడు నెలల్లోగా అన్ని పట్టణాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని.. ఐదు నెలల్లోగా కరెంటు సంబంధిత సమస్యలు పరిష్కారం చేయాలని.. లేని పక్షంలో సంబంధిత ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు. 


వార్డులవారీగా ప్రణాళికలు తయారు చేయాలి.. 

వార్డులవారీగా ప్రణాళికలు రూపొందించి.. ప్రతి పట్టణానికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలు కూడా తయారు చేసుకోవాలి. కౌన్సిలర్లను కలుపుకుని.. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ప్రణాళికలు తయారు చేసి వార్డులవారీగా నియామకమైన ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలి. ప్రతి వార్డుకు శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేకాధికారి నియమించి.. ప్రతి వార్డును ఎక్స్‌రే తీయాలి. చెత్త, మురికినీటి శుభ్రత, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, రహదారిపై గుంతలు, గోతులు లేకుండా చూసుకోవాలి. డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు, ఓపెన్‌ జిమ్‌లు, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్‌ టాయిలెట్లు, స్ట్రీట్‌ వెండర్లకు ప్రత్యేక స్థలం, ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేయాలి. మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని, కౌన్సిలర్లు ఈ బాధ్యతను తీసుకోవాలన్నారు. పెట్టిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతికి ఉండాలని.. పట్టణాలకు అవసరమయ్యే నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్త సేకరణకు బుట్టల పంపిణీ, చెత్త సేకరణకు వాహనాలు సమకూర్చుకోవాలని.. కొత్త వాహనాలు కొనుగోలు చేయాలన్నారు.

 

పట్టణ ప్రగతికి రూ.148 కోట్లు 

పట్టణాలకు ప్రతి నెలా రూ.148 కోట్లు ఇస్తామని.. పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జీవో నంబరు 58, 59 ద్వారా పట్టణాల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించినట్లే అన్ని మున్సిపాలిటీల్లో మరో అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. సమావేశంలో భాగంగా ఛైర్మన్లతో సీఎం కేసీఆర్‌ ముఖాముఖి నిర్వహించి.. వారి సందేహాలను నివృత్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, వైకుంఠధామం, అర్బన్‌ పార్కులను పరిశీలించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా, అదనపు కలెక్టర్‌ రాంబాబు, ఎమ్మెల్యే కోనప్ప, చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, కమిషనర్‌ తిరుపతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


logo