ఆదివారం 29 మార్చి 2020
Komarambheem - Feb 12, 2020 , 23:36:01

పాల వెల్లువ

పాల వెల్లువ

నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో విజయా డెయిరీని నిర్వహిస్తున్నారు. రైతుల వద్ద నుంచి పాలను సేకరించి చిల్లింగ్‌ చేయడంతోపాటు వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, లక్షెట్టిపేట, కడెం, భైంసా ప్రాంతాల్లో విజయా డెయిరీ ఆధ్వర్యంలో పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో కేంద్రం 5 వేల లీటర్ల సామర్థ్యంతో నడుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక జిల్లాలో పాల ఉత్పత్తి, సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 25 వేల లీటర్ల సామర్థ్యం కేంద్రాలుండగా.. వచ్చే ఆరు నెలల్లో లక్ష లీటర్ల సామర్థ్యం గల కేంద్రాలను అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్‌లో ఉన్న 5 వేల లీటర్ల కేంద్రాన్ని 20 వేల లీటర్లకు, లక్షెట్టిపేట్‌లో ఉన్న 5 వేల లీటర్ల కేంద్రాన్ని 20 వేల లీటర్లకు, నిర్మల్‌లో ఉన్న 5 వేల లీటర్ల కేంద్రాన్ని 10 వేల లీటర్ల సామర్థ్యానికి పెంచుతున్నారు. మరోవైపు కుంటాల, లోకేశ్వరం, భైంసా మండలం దేగాం, జైనథ్‌, బేల, ఖానాపూర్‌, ఉట్నూరు, ఇచ్చోడ, బోథ్‌, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, దండేపల్లి, జన్నారం, బెల్లంపల్లి వంటి చోట్ల పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదిలాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు టీఎస్‌డీడీసీ ఛైర్మన్‌ లోక భూమారెడ్డి పాల శీతలీకరణ కేంద్రాల సామర్థ్యం పెంపు కోసం నిధులు కావాలని కోరారు. దీంతో రూ. 18 కోట్లు సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారు. ఇందులో కొన్నిచోట్ల పనులు పూర్తవ్వగా.. మరికొన్నిచోట్ల ప్రగతిలో ఉన్నాయి. 


సబ్సిడీపై పాడి పశువులు

వచ్చే ఆరు నెలల్లో అన్ని కేంద్రాల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం 25 వేల లీటర్ల పాలను సేకరిస్తుండగా.. దీన్ని లక్ష లీటర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై పాడి పశువులు అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం రాయితీ ఉండగా.. ఇతర రైతులకు 50 శాతం రాయితీ ఇస్తున్నారు. ఒక్కో గేదె ధర రూ.80 వేల వరకు ఉండగా.. రైతుల ఇష్టం మేరకు ఏ రాష్ట్రంలోనైనా కొనుగోలు చేసుకోవచ్చు. రాయితీ డబ్బులను రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 2 వేల పాడి పశువులను పంపిణీ చేయగా.. మరో 1200 పాడి పశువులను పంపిణీ చేసేలా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఐకేపీ ఆధ్వర్యంలో పాల సేకరణ నడుస్తోంది. గ్రామాల్లో రైతులు.. పాడి పారిశ్రామిక సంఘాల్లో పోస్తుండగా.. అక్కడి నుంచి పాల శీతలీకరణ కేంద్రాలకు ఆటోల్లో తీసుకొస్తున్నారు. ఈ విధంగా వచ్చిన కమీషన్‌ నుంచి ఐకేపీ సిబ్బందికి 

వేతనాలు ఇస్తున్నారు. ఇకపై ఐకేపీ సిబ్బందిని విజయా డెయిరీలోకి విలీనం చేయాలని నిర్ణయించారు. విజయా డెయిరీ ఆధ్వర్యంలో ఐకేపీ సిబ్బంది విక్రయాలు జరిపేలా అన్ని జిల్లాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో పాల ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మిగతా చోట్ల కూడా వాటిని విస్తరిస్తున్నారు. ఇకపై ఐసీడీఎస్‌, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో విజయా డెయిరీ ద్వారానే పాల సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు 

చేపట్టారు. 



లక్ష లీటర్ల పాల సేకరణే లక్ష్యం

ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న విజయా డెయిరీని తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. లాభాల బాటలోకి తెచ్చాం. రూ.140 కోట్ల నష్టాల్లో ఉన్న దీన్ని రూ.51కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చాం. ఉమ్మడి రాష్ట్రంలో రూ.500 కోట్ల వ్యాపారం చేయగా.. ప్రస్తుతం రూ. 800 కోట్ల వ్యాపారం చేస్తున్నాం. మార్చి నెలాఖరుకు దీన్ని రూ.1000 కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 25 వేల లీటర్ల పాలను సేకరిస్తుండగా.. ఆరు నెలల్లోపు లక్ష లీటర్ల సేకరణ చేస్తాం. ఐకేపీ సిబ్బందిని కూడా విజయా డెయిరీలో విలీనం చేసేందుకు కసరత్తు మొదలెట్టాం. పాత పాల శీతలీకరణ కేంద్రాల సామర్థ్యం పెంచడంతోపాటు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రూ.18 కోట్లతో పనులను చేపట్టాం. రైతులకు రాయితీపై పాడి పశువులను అందిస్తున్నాం.  రైతులను లాభాల బాటల్లో తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం.

- లోక భూమారెడ్డి, టీఎస్‌డీడీసీ చైర్మన్‌


logo