ఖమ్మం అర్బన్, జనవరి 20: గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలు విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణితో విద్యార్థులు క్షణక్షణం భయంభయంగా గడపాల్సిన పరిస్థితి దాపురించింది. తాజాగా ఖమ్మంలోని బొమ్మ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంగా నిర్వహిస్తున్న తిరుమలాయపాలెం సోషల్ వెల్ఫేర్ గురుకులానికి తాళం వేయడం.. మూడు రోజుల తర్వాత తిరిగి తెరుచుకోవడం మరో నిదర్శనం. గత పదినెలలుగా అద్దె చెల్లించకపోవడంతో విసిగి వేసారిన భవన యజమానులు శనివారం తరగతి గదులకు తాళాలు వేసిన విషయం విదితమే. ఉన్నతాధికారుల జోక్యంతో సోమవారం మధ్యాహ్నానికి గానీ తాళాలు తెరుచుకోలేదు. భవనాన్ని ఖాళీ చేయాలని పలు ధపాలుగా నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో యజమానులు శనివారం గురుకులానికి తాళం వేశారు. సోమవారం ఉన్నతాధికారులు స్పందించి ఆరు నెలల్లో ఖాళీ చేస్తామనే హామీ ఇచ్చారు. దీంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. అప్పటివరకు విద్యార్థులు గురుకులం బయట పడిగాపులు కాయడం కాశారు.
విద్యార్థుల పడిగాపులు..
సంక్రాంతి సెలవులు ముగిసిన అనంతరం ఈ నెల 18వ తేదీ శనివారం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. నగరంలోని తిరుమలాయపాలెం సోషల్ వెల్ఫేర్ గురుకులానికి సంబంధించి పది నెలల అద్దె బకాయిలు, 13 నెలల కరెంట్ బకాయిలు పేరుకుపోవడంతో ఎన్నిసార్లు రాతపూర్వకంగా విన్నవించినా అధికారులు స్పందించలేదు. దీంతో భవన యజమానులు శనివారం లోపలికి తరగతి గదులకు వెళ్లేందుకు వీలులేకుండా తాళం వేశారు. గురుకుల కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది విజ్ఞప్తి చేయడంతో గేట్‌కు తాళం ఓపెన్ చేశారు. కానీ తరగతుల్లోకి వెళ్లేందుకు ఉన్న గ్రిల్స్ తాళం మాత్రం తెరవలేదు. శనివారం కేవలం పది మంది విద్యార్థులు మాత్రమే రావడంతో వారిని గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే ఉంచారు. ఆదివారం కూడా విద్యార్థులు రాలేదు. సెలవుల అనంతరం సోమవారం విద్యార్థులను తీసుకుని తల్లిదండ్రులు అధికసంఖ్యలో వచ్చారు. గ్రిల్స్‌కు తాళం వేసి ఉండడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యార్థులు స్కూల్ ముందే తమ సామాన్లతో ఎదురుచూసుకుంటూ ఉన్నారు.
హామీతో తెరుచుకున్న తాళాలు…
ఇప్పటికే 30 నోటీసులు ఇచ్చామని, ఎప్పుడు ఖాళీ చేస్తారో రాతపూర్వకంగా ఇస్తేనే తాళం తీస్తామని భవన యజమానులు స్పష్టంచేశారు. దీంతో జోనల్ ఆఫీసర్ స్వరూపరాణి తిరుమలాయపాలెం గురుకుల కళాశాలను సందర్శించారు. జోనల్ ఆఫీసర్, గురుకుల ప్రిన్సిపాల్‌తో భవన యజమానులు చర్చలు జరిపారు. ఈ విద్యాసంవత్సరం అనంతరం భవనాన్ని ఖాళీ చేస్తామని హామీ ఇవ్వడంతో తాళాలు తెరిచారు. తరువాత విద్యార్థులను లోపలికి అనుమతించారు.