మధిర, ఆగస్టు 19 : మున్నేరులో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు అందులో పడి గల్లంతైన సంఘటన మంగళవారం మధిర శివాలయం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లికి చెందిన పెసరవెల్లి వినోద్ (34) మధిర శివాలయం సమీపంలో గల చెక్ డ్యామ్ వద్దకు చేపల వేటకు వెళ్లాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు చెక్ డ్యామ్ వద్ద ప్రమాదవశాత్తు పడిపోయాడు. విషయాన్ని స్థానిక టౌన్ పోలీసులకు, ఫైర్ స్టేషన్ అధికారులకు తెలిపారు. అక్కడకు చేరుకున్న పోలీస్, ఫైర్ సిబ్బంది గల్లంతయిన యువకుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రత్యేక బృందాన్ని తీసుకువచ్చి గాలింపు చర్యలు చేపడతామని తాసీల్దార్ రాంబాబు తెలిపారు.