– కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 08 : పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని, భవన నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం పోనేకల్ లో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. నిర్మాణ ప్రాంతాలను తిరుగుతూ పనుల నాణ్యతను, క్షేత్రస్థాయిలో భవనాల నమునా మ్యాప్ లను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల వద్ద లింక్, అంతర్గత రోడ్డు, విద్యుత్ సరఫరా ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గం ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే విద్యా వ్యవస్థలో ప్రపంచానికి పోటీ పడే విధంగా మన విద్యార్థులను తయారు చేసుకునేందుకు అవసరమైన ప్రణాళికలు, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని, భవిష్యత్‌లో ఉత్తమమైన చదువు అందించే ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందించేందుకు సమీకృత విద్యా సంస్థలను ఏర్పాటు చేసే సంకల్పానికి అధికారులు సమన్వయంతో పని చేసి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఖమ్మం జిల్లా పరిధిలో ఐదు యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు మంజూరు అయి నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలు విద్యలో సమూలమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తాయని, పేద పిల్లల బంగారు భవిష్యత్‌కు నాణ్యమైన నిర్మాణ పనులతో పూర్తి చేసి సకాలంలో అందించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తి చేసి పిల్లలకు అందుబాటులో తీసుకురావాలని, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని, పనుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఈఈ బుగ్గయ్య, ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ ఎం.వినయేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

‘సకాలంలో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు పూర్తి చేయాలి’