Ration Card Applications | మధిర: రేషన్ కార్డులు కోసం మీ-సేవ కేంద్రాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు మధిర తాహశీల్దార్ రాచబండి రాంబాబు సూచించారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు, కార్డులు చేర్పులు మార్పుల కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులను తాహశీల్దార్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మీ-సేవ కేంద్రాల్లో రేషన్ కార్డులు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారి దరఖాస్తును పరిశీలిస్తామన్నారు. గతంలో పెళ్లయిన వారి పిల్లల పేర్లు ఆధార్లో నమోదు కాకపోతే సంబంధిత ఆధారాలతో మీ-సేవ ద్వారా ఆన్లైన్లో చేయించుకోవాలన్నారు. పెండ్లయిన ఆడబిడ్డలు తమ తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి వారి పేర్లను తొలగించడం కోసం దరఖాస్తు చేసుకుంటే వారి పేర్లు తొలగిస్తామన్నారు. కొత్తగా రేషన్ కార్డుల జారీ, పేర్ల తొలగింపు/ చేర్పులు నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.