కూసుమంచి, డిసెంబర్ 15: వానకాలం పంటలకు చేతికి రావడంతో రైతులు యాసంగికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సాగర్ ఆయకట్టులో వరి కోతలు పూర్తయ్యాయి. మరోవైపు రైతులు నార్లు పోస్తున్నారు. గతంలో రెండో పంటకు నీటి విడుదలపై అనేక అనుమానాలు ఉండేవి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ సర్కార్ యాసంగికి సాగర్ జలాలు విడుదల చేస్తామని ప్రకటిచంచడంతో రైతాంగం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాలేరు రిజర్వాయర్ నీటిపారుదలశాఖ అధికారులు 87 రోజుల పాటు పంటలకు 21.50 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీటితో యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2.54 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. మొదటి విడత నీటి విడుదల గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో జనవరి 7 వరకు నిరవధికంగా 24 రోజుల పాటు నీరు దిగువకు విడుదల కానున్నది. ఇలా మొత్తం ఎనిమిది విడతలుగా సాగునీరు విడుదల చేస్తారు.
కృష్ణా బోర్డ్ ఆదేశాల మేరకు సాగర్ రెండు, మూడో జోన్ ఆయకట్టుకు 21.50 టీఎంసీలు విడుదల కానున్నాయి. పాలేరు నుంచి కల్లూరు వరకు రెండో జోన్ వరి సాగు, కల్లూరు నుంచి కృష్ణా జిల్లా నూజివీడు వరకు మూడో జోన్లో ఆరుతడి పంటలకు సాగునీరు అందనున్నది. వారం రోజలుగా రెండో జోన్ పరిధిలోని బోనకల్ ప్రాంతంలోని పంటలకు 1,685 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. గురువారం నుంచి యాసంగి ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా 2,741 క్యూసెక్కులు విడుదల చేశారు. శుక్రవారం మరింత పెంచే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరోవైపు వ్యవసాయశాఖ అధికారులు రైతులు సాగర్ ఆయకట్టులో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. కాలువలు, చెరువులు, ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టుల నిర్వహణలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు.