Santhu Sevalal | జూలూరుపాడు, ఫిబ్రవరి 16: బంజారాల ఆరాధ్య దైవం గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని వైరా ఎమ్మెల్యే మాళోత్ రామదాస్ నాయక్ కోరారు. జూలూరుపాడు మండలంపడమటి నర్సాపురం గ్రామ సమీపంలోని సంత్ సేవాలాల్ దేవాలయం వద్ద వైరా నియోజకవర్గస్థాయి సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాళోత్ రామదాస్ నాయక్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవలాల్ మహారాజ్ చూపించిన మార్గం అందరికీ ఆదర్శనీయమన్నారు.
మహారాజ్ బంజారా జాతి పురోగమనానికి ఎంతో కృషి చేశారని ఆయన సేవలను మాళోత్ రామదాస్ నాయక్ కొనియాడారు. తండాల అభివృద్ధికి సేవాలాల్ మహారాజ్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ముందుగా ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు అధికారులు సంప్రదాయబద్ధంగా ఘనంగా స్వాగతం పలికారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఏన్కూరు, జూలూరుపాడు, కొణిజర్ల, సింగరేణి, వైరా మండలాల సంతు సేవాలాల్ నాయకులు అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.