బూర్గంపహాడ్/మణుగూరు టౌన్/అశ్వారావుపేట టౌన్, ఆగస్టు 9 : ఆదివాసీలందరూ తమ సంస్కృతిని కాపాడుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆకాంక్షించారు. అయితే ఇతిహాసాలు, నాగరికతను పాటించడంలో వారు ఇప్పటికీ ఆదర్శంగా ఉన్నారని అన్నారు. అలాగే ప్రపంచ దేశాలు కూడా ఆదివాసీల సంప్రదాయాలను గౌరవిస్తే ఆదివాసీ తెగ అంతరించిపోకుండా ఉంటుందని అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలోని ఐటీడీఏ గిరిజన భవన్లో పీవో రాహుల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొర వంటి ఎందరో ఆదివాసీల త్యాగాల ఫలితంగానే ఆదివాసీ దినోత్సవం ఏర్పడిందని గుర్తు చేశారు. ఆదివాసీలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించడానికి 1982లో ఐక్యరాజ్యసమితి నెదర్లాండ్‌లో 140 దేశాల ప్రతినిధులు సమావేశమై ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించినట్లు జ్ఞప్తికి తెచ్చారు.
ఆనాటి నుంచి ఆదివాసీ తెగల గిరిజనులు ఈ రోజును వారి సంస్కృతీ సంప్రదాయాల పండుగగా జరుపుకుంటున్నారని అన్నారు. తొలుత ఐటీడీఏ పీవో రాహుల్, ఏపీవో డేవిడ్‌రాజ్, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు కలిసి ఐటీడీఏ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ గిరిజన ఆదివాసీ మహనీయుల విగ్రహాలకు, అమరవీరుల స్తూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీ అగ్రభాగాన ఆదివాసీల సంప్రదాయ కొమ్ము నృత్యాలు, డప్పు వాయిద్యాలు అలరించాయి. మళ్లీ ఐటీడీఏకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
ఆదివాసీలకు సేవచేసేందుకు కలిగిన ఈ అవకాశం తమ అదృష్టమని భద్రాద్రి కలెక్టర్ జితేశ్, ఐటీడీఏ పీవో రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజు పేర్కొన్నారు. భద్రాచలం ఐటీడీఏలో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో వారు మాట్లాడుతూ.. అడవులు అంతరించిపోకుండా ఆదివాసీలు కాపాడుతుండడం, అటవీ ఫలాలతో జీవనోపాధిని పెంపొందించుకోవడం అభినందనీయమని అన్నారు. ఆదివాసీ గిరిజనుల విద్య, సంక్షేమం, అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయని వివరించారు. అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభచూపిన ఆదివాసీ క్రీడాకారులను సన్మానించారు. ఆదివాసీ దినోత్సవ వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
అధికారం ఉన్నా లేకున్నా ఆదివాసీల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో వారు మాట్లాడారు. ఆదివాసీ గిరిజనుల హక్కుల సాధనకు తాము ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయా మండలాల్లోని ఆదివాసీ అమరుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశ్వారావుపేట సీహెచ్‌సీని మెచ్చా నాగేశ్వరరావు పరిశీలించారు.
ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి: రేగా
ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కోరారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మణుగూరులో కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో గిరిజన మహిళ ముర్ము దేశానికి రాష్ట్రపతి అయిన తర్వాతే ఆమె గ్రామానికి కరెంట్ వచ్చిందని గుర్తు చేశారు.
మామిళ్లగూడెం, ఆగస్టు 9 : మనిషి భవిష్యత్‌ను తీర్చిదిద్దేది చదువు ఒక్కటేనని, అందుకే విద్యార్థి దశనుంచే చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే చదువు ఒక్కటే మూలమన్నారు. ఆరోగ్యపరంగా ప్రకృతిలో మమేకమై సంతోషకరమైన జీవనం గడపడాన్ని ఆదివాసీల నుంచే సమాజం నేర్చుకోవాలన్నారు.
అనంతరం జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ ఉప సంచాలకులు విజయలక్ష్మి స్థానిక గిరిజన భవనంలో ఆదివాసీల జెండాను ఆవిష్కరించారు. కుమ్రం భీం, బిర్సాముండా వంటి ఆదివాసీ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గిరిజన భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. గిరిజన సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఏవో నారాయణరెడ్డి, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, ఏసీఎంవోలు, హెచ్‌డబ్ల్యూవోలు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.