ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ సతుపల్లి టౌన్, జూన్ 24: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నటన.. విశ్వనటుడు కమల్‌హాసన్‌ను మించి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో హంగామా సృష్టించిన భట్టి.. ‘బాండు’ను తయారు చేసి ఇంటింటికీ పంపించారని, వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మరి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయినా వాటిల్లో ఏ ఒక్కటైనా ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఆ కార్డులను ఎక్కడ భద్రపర్చుకోవాలో భట్టి సెలవియ్యాలని నిలదీశారు. ఖమ్మం జిల్లాకు పవర్ కలిగిన ముగ్గురు మంత్రులమున్నామని ప్రచారం చేసుకుంటున్నారని, కానీ.. జిల్లా ప్రజలకు ఒరిగిన ప్రయోజనం ఏమీలేదని ఎద్దేవాచేశారు.
కేసీఆర్ నడుంబిగించి ప్రారంభించిన సీతారామ ప్రాజెక్టును ఈ పాలకులు, మంత్రులు ఇప్పటివరకు పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. పబ్లిసిటీ కోసమే సీతారామ నీటిని మంత్రి తుమ్మల నెత్తిన చల్లుకున్నారు తప్ప ఒక్క ఎకరానికీ సాగునీరు ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్టదని, కమీషన్ వచ్చే పనులే ఈ ప్రభుత్వానికి ప్రధాన అజెండా అని విమర్శించారు. ఎస్ఐఆర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అంశాలపై పార్టీ శ్రేణులకు శిక్షణ ఇచ్చేందుకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అక్కడి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రైతులకు యూరియా కష్టాలు తెచ్చింది, యాప్ పేరుతో వాటిని మరింతగా పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేటీఆర్ విమర్శించారు. అసలు షాప్‌లో లేని యూరియా యాప్‌లోకి ఎలా వస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఈ యూరియా యాప్‌ను బంగాళాఖాతంలో వేస్తామని స్పష్టం చేశారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకూ నెలకు రూ.2,500 ఇస్తామంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఎప్పుడు అమలుచేస్తారని సీఎం రేవంత్‌రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ హామీ ప్రకారం రాష్ట్రంలో 1.67 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక్కో మహిళకు రూ.1.50 లక్షలు జమ చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని సవాల్ విసిరారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి.. వారిని కనీసం లక్షాదికారులను కూడా చేయలేకపోయారని విమర్శించారు. తెలంగాణ తొలి ప్రభుత్వం అప్పులు చేసిందని కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రంలో అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేశారు. 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటివి చేయగలిగామని వివరించారు. సీతారామ ప్రాజెక్టును 80 శాతం పూర్తిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు వరప్రదాయినిగా మార్చామని గుర్తుచేశారు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న ఈ రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల అప్పుచేసిందని తెలిపారు. మరి ఈ అప్పులతో చేసిన అభివృద్ధి ఏమిటో, సాధించిన ప్రగతి ఏమిటో, సంక్షేమానికి వెచ్చించింది ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ రూ.4 లక్షల కోట్ల అప్పుతో రేవంత్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గుండుసున్నా అని విమర్శించారు.
కాంగ్రెస్ పాపాల చిట్టాను ప్రజలు గమనిస్తున్నారు..
కాంగ్రెస్ పాపాల చిట్టాను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే కూల్చివేతలే అన్నట్లుగా ఉందని విమర్శించారు. అందుకే వెలుగుమట్లలో వెయ్యి ఇళ్లను కూల్చారని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డు వస్తున్నారనే కారణంతో వెలుగుమట్ల పేదల కడుపులో తన్నిన నీచ చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు ఉందని ధ్వజమెత్తారు. సత్తుపల్లిలోని బుగ్గపాడులో ఫుడ్‌పార్కులో ఒక్కో ఎకరం భూమిని రూ.21 లక్షల చొప్పునే అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మార్కెట్ విలువ రూ.60 లక్షలు, టీఎస్ఐడీసీ విలువ రూ.40 ఉన్నప్పటికీ రూ.21 లక్షల చొప్పున ఎందుకు అమ్మారో చెప్పాలని నిలదీశారు. ఇందులో మంత్రి తుమ్మల ప్రయోజనం లేదా అని ప్రశ్నించారు. అలాగే, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.100 కోట్ల మట్టిని మంత్రి తుమ్మల అక్రమంగా తరలిస్తున్న విషయం ప్రజలకు తెలియనిది కాదని అన్నారు.
కేసీఆర్‌కు గెలుపోటములు సమానం..
ప్రధాని పదవి తప్ప అన్ని రకాల పదవులనూ కేసీఆర్ నిర్వహించారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆయనకు పదవీ వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ఆయన ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాక అనేక ఇబ్బందులు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గెలుపోటములను కేసీఆర్ సమానం చూస్తారని; గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం ఎప్పుడూ చేయలేదని జ్ఞప్తికి తెచ్చారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి తెలంగాణ ఆవిర్భవించి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంతవరకు రైతు చేతిలో రూపాయి పెట్టిన నాథుడే లేడని గుర్తుచేశారు. 2014 నుంచి బీఆర్ఎస్ హయాంలో 11 సార్లు రైతులకు పెట్టుబడి సాయం రూపంలో రూ.77 వేల కోట్లు అందించిన ఘనత కేసీఆర్‌దని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికి 72 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారే తప్ప ప్రజలకు తెచ్చిందేమీలేదని విమర్శించారు.
రియల్ ఎస్టేట్ కోసమే వెలుగుమట్ల ఇళ్లు కూల్చారు..
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మంత్రులు పొంగులేటి, తుమ్మల కలిసి ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చారని కేటీఆర్ విమర్శించారు. వారి విల్లాలకు ఈ పేదల గుడిసెలు అడ్డువస్తున్నాయని తొలగించుకున్నారని ఆరోపించారు. ‘దుర్మార్గపు కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి..’ అని రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలకు గౌరవం, సముచిత స్థానం లభిస్తుందని భరోసా ఇచ్చారు.
ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి..
ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఎస్ఐఆర్పై పోలింగ్ కేంద్రం స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల తొలగింపు జరుగుతున్న తీరును పరిశీలించాలని కేటీఆర్ సూచించారు. రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు డిజిటల్ ఐడీ కార్డు ఇస్తామన్నారు. దీంతోపాటు వారు ఏ కార్యాలయాలకు వెళ్లినా కేసీఆర్ మనిషిగా గుర్తింపుతో గౌరవప్రదమైన ఆదరణ లభించే బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడ్డామని గుర్తుచేశారు. కానీ అదే సమయంలో కార్యకర్తలకు, ఉద్యమకారులకు మరింత గుర్తింపు దక్కాల్సి ఉందని అన్నారు.
రుణమాఫీని ఎందుకు పూర్తిచేయలేదు?
ఈ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతుల రుణమాఫీ నిధులు రూ.50 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు తగ్గాయని కేటీఆర్ ఆరోపించారు. రూ.50 వేల కోట్లతో రాష్ట్రంలోని రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటికీ ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. తొలుత రూ.40 వేల కోట్లుగా, తర్వాత రూ.31 వేల కోట్లుగా, అసెంబ్లీలో రూ.26 వేల కోట్లుగా రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. కానీ, తాము రూ.20 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశామంటూ మంత్రి తుమ్మల బహిరంగంగా ప్రకటించడంతో రుణమాఫీపై ప్రభుత్వ విధానం స్పష్టమైందని అన్నారు.
ఇప్పటికీ మాఫీ అయిన రుణాలు రూపాయిలో 40 పైసలు మాత్రమేనని, ఇంకా 60 పైసల మేర మాఫీ జరగాల్సి ఉందని అన్నారు. అలాగే.. ఈ రెండున్నరేళ్లలో మూడుసార్లు రైతుబంధును ఎగవేసిన పాలకులెవరో ప్రజలకు తెలుసునని అన్నారు. రుణమాఫీ, రైతుబంధు పేరుతో రైతులను మోసం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని విమర్శించారు. పంటలకు బోనస్ అని చెప్పి ఇప్పుడు బోగస్ మాటలు చెబుతున్నారని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు కేవలం వరిధాన్యంలోని ఏడు సన్నరకాలకే బోనస్ ఇస్తామని చెబుతోందని దుయ్యబట్టారు. భవిష్యత్‌లో ఇది కూడా కొనసాగే అవకాశం ఉండదని అనుమానం వ్యక్తం చేశారు. చివరికి, ధాన్యం కొనుగోళ్లలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
రాజకీయ ప్రయోజనం కోసమే 30న రైతుభరోసా..
ఈ నెల 30న మధిరలో సభ నిర్వహించి రైతుభరోసా వేస్తున్నామని రేవంత్ చెబుతున్నారంటే ఏదో రాజకీయ ప్రయోజనం దాగి ఉందన్న అనుమానం వ్యక్తమవుతోందని కేటీఆర్ అన్నారు. ఈ రైతుబంధు వేసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశమూ లేకపోలేదని అన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో మెజార్టీ ఓట్లు చూపించిన వారే పార్టీకి నాయకులు అవుతారని, పార్టీలో వారే కథానాయకులుగా ఉంటారని, వారి రాజకీయ భవిష్యత్‌కు అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ రోజురోజుకూ పడిపోతున్నా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం విస్తరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ సదస్సులో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధు, తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, బీఆర్ఎస్ నేతలు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, దిండిగల రాజేందర్, ఉప్పల వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రైతుబంధుకు ఎగనామం..
రాష్ట్రంలో రైతుబంధుకు ఎగనామం పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఢిల్లీలో రాహుల్బంద్ను ప్రారంభించారని ఆరోపించారు. అందుకే ప్రతినెలా మూటలు అందజేయడం ద్వారా తన కుర్చీని కాపాడుకుంటున్నారని విమర్శించారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రేవంత్.. ఈ రెండున్నరేళ్లలో కనీసం 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను భర్తీచేసి వాటిని వారి ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొడితే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయని ప్రగల్బాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు నిరుద్యోగుల వైపు కూడా చూడడంలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ ఢిల్లీకి నెలనెలా కప్పం కడుతూ రెన్యూవల్ సీఎంగా కొనసాగుతున్నారని, ఈయన రెగ్యులర్ సీఎం కాదని చురకలంటించారు. ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రంలో రూ.పది వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకోవడం ద్వారా నష్టపోయింది ఎవరో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం: అజయ్
ఈ రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో అనేక పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను చూసి ఆ పరిశ్రమలతోపాటు మిగతా పరిశ్రమలు తరలిపోతున్నాయని అన్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులూ ఎవరి స్థాయిలో వారు అవినీతిలో పోటీ పడుతున్నారని ఆరోపించారు.
బూత్ లెవల్ ఏజెంట్లే పార్టీకి కీలకం: తక్కెళ్లపల్లి
ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలనలో బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లే (బీఎల్ఏ) పార్టీకి కీలకమని, బూత్ లెవల్ అధికారులతో నిత్యం సమన్వయం చేసుకుంటూ ఎస్ఐఆర్ కార్యక్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా ఉంటారని, ప్రతి ఓటు అమూల్యమైనది కాబట్టి అర్హత ఉన్న ఏ ఒక్క ఓటూ తొలగిపోకుండా చూసుకోవాలని సూచించారు.
అధికారం కోసమే ‘తుమ్మల’ పార్టీలు మారారు: నామా
సీనియర్ మంత్రినని చెప్పుకుంటున్న తుమ్మల నాగేశ్వరరావు.. అధికారం కోసం పార్టీలు మారారని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ఖమ్మం జిల్లాను తానే అభివృద్ధి చేశానంటూ గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను ఖమ్మం జిల్లాకు తానే తెచ్చినట్లు తుమ్మల ఇటీవల చెప్పుకున్నారని అన్నారు. ఆయన మాటలను పత్రికల్లో చూసి తాను ఆశ్చర్యపోయానని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు: తాతా మధు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీలేదని ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు, సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇక్కడ ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పటికీ ఆ రిజర్వేషన్లను అమలు చేయలేదని విమర్శించారు.
సభ్యత్వ నమోదులో ఉత్సాహంగా పాల్గొనండి: సండ్ర
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ కోసం నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు బూత్ లెవల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకొని ఓట్లను కాపాడుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఓటరు గుర్తింపు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు.