నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 1 : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కార్మిక లోకం డిమాండ్ చేసింది. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడంతో కన్నెర్ర చేసింది. కార్మిక హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వంపై భగ్గుమన్నది. ప్రధానమంత్రి మోదీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బుధవారం అన్నివర్గాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా కార్మికులు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, నల్లబ్యాడ్జీలు ధరించడం, దిష్టిబొమ్మల దహనాలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు శాపంగా మారాయని, వాటిని రద్దు చేసేవరకు శ్రామికవర్గం ఉద్యమిస్తుందని తేల్చిచెప్పారు.

కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిలిటెంట్ కార్మికోద్యమ పోరాటాలు బ్రిటిష్ పరిపాలన కాలంలోనూ ఆ తర్వాత కూడా ఒక దశ వరకు నిరంతరం కొనసాగాయని గుర్తుచేశారు.

లేబర్ కోడ్ చట్టాలను తెలంగాణలో అమలు కానీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని కోరారు. నూతన కోడ్లతో పని భద్రత తగ్గిపోవడంతోపాటు పని చేసేచోట మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. కార్మిక సమస్యలపై ప్రశ్నించేందుకు యూనియన్లను లేకుండా చేసేవిధంగా లేబర్ కోడ్లను తయారు చేశారని ఆరోపించారు. కొత్త చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
