కారేపల్లి,మార్చి30 : తెలంగాణలో మహిళా స్వయం సహాయక బృందాలను(SHG)ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటీన్లను(స్త్రీ టీ క్యాంటీన్లు) ఏర్పాటు చేసింది. అయితే అవి కొన్నిచోట్ల కేవలం అలంకారప్రాయంగానే మిగిలిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో మహిళలకు నిజమైన ఉపాధిని కల్పించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించి ఈ క్యాంటీన్లను మహిళ స్వయం సహాయక సంఘాల(SHG)సభ్యులే నిర్వహించేలా ప్రభుత్వ కార్యాలయాలు, నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్ల ద్వారా నిర్వాహక మహిళలకు స్వయం ఉపాధి లభించడమే కాక అదనపు ఆదాయం చేకూరుతుంది.
కారేపల్లి మండలంలో రెండు చోట్ల స్త్రీ టీ క్యాంటీన్లను ఏర్పాటు చేయగా మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన క్యాంటీన్ మాత్రం ఎప్పుడూ మూతపడే ఉంటుంది.ఇతర చోట్ల మహిళలు ఈ క్యాంటీన్లను విజయవంతంగా నడుపుతూ ఇంటికి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటుండగా ఇక్కడి నిర్వాహకుల తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సింగరేణి ఐకెపి ఎపీఎం పిడమర్తి వెంకటేశ్వరరావును నమస్తే తెలంగాణ వివరణ అడగగా.. 8 నెలల కిందట ప్రారంభించిన ఈ క్యాంటీన్‌ను సదరు స్వయం సహాయక సంఘం సభ్యురాలు సక్రమంగా నిర్వహించడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.
కారేపల్లి లోని రెండు స్త్రీ టీ క్యాంటీన్లకు సామాజిక పెట్టుబడి నిధి(సీఐఎఫ్)నుండి బ్యాంకు ద్వారా ఒక్కొక్కరికి రూ.1,50,000లు రుణం(ఆర్థిక సహాయం)ఇచ్చి ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న క్యాంటీన్ సక్రమంగానే నడుస్తుందన్నారు. ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్‌ను వేరే స్వయం సహాయక సంఘం సభ్యురాలుకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.