– తిరుమలాయపాలెం మండలం గోల్తండాలో ఘటన
తిరుమలాయపాలెం. మే 22 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్తాండాలో గుగులోతు మీనాక్షి(30) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మీనాక్షికి అదే గ్రామానికి చెందిన శివాజీతో 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో భర్త శివాజీకి వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందనే విషయమై భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా వివాదం జరుగుతుంది. ఈ క్రమంలో గురువారం ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. శరీరంపై గాయాలు ఉండడంతో ఆమెను హత్య చేసి చీరతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.