భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 17 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తిన చెందడం శుభపరిణామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించాన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రేగా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం రాకముందు భారతదేశ స్వరూపం భిన్నంగా ఉండేదని అన్నారు.
కొంతభాగం బ్రిటీష్‌వారు పరిపాలించే బ్రిటీష్ ఇండియాగా ఉంటే మిగతా ప్రాంతం సంస్థానాదీశుల పాలనలో ఉండేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిందన్నారు. సీఎం కేసీఆర్ చేసిన పోరాట ఫలితమే తెలంగాణ అని, అందుకే ఈ రోజు రాష్ట్రంలో అన్నిరంగాలు అభివృద్ధి చెందాయన్నారు. నాటి అద్భుత ఘట్టాలు నేటికీ స్మరించుకోవాలన్నారు. అదిలాబాద్ అడవుల్లో తుడుం మోత మోగించి ఆడబిడ్డలను ఒక్కటి చేసి జల్ జంగిల్ జీమీన్ కోసం సింహగర్జన చేసిన ఆదివాసీ యోధుడు కొమురం భీమ్ సాహసాన్ని సగర్వంగా తలుచుకోవాలన్నారు.
స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారన్నారు. ఏనాడు భద్రాద్రి జిల్లా అవుతుందని ఊహించలేదని, ఆ జిల్లాకు మెడికల్ కాలేజీ వస్తదని కూడా అనుకోలేదని అన్నారు. అలాంటి అనితర సాధ్యమైన సమస్యల పరిష్కారం ఒక కేసీఆర్‌కే సాధ్యమైందని అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ వినీత్, కలెక్టర్ కుటుంబ సభ్యులు, ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్ కుటుంబ సభ్యలతో పాటు జడ్పీ వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.