వానకాలం వచ్చిందంటే గోదావరి ముంపు ప్రాంతవాసులను ‘వరద భయం’ వెంటాడుతున్నది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ‘గుండెలు గుబేల్’ అంటుంటాయి. ఎందుకంటే ప్రతి యేటా వరద కష్టాలు తప్పడం లేదు. కొన్ని ఏళ్లుగా జూలై నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చిన సందర్భాలు లేకపోలేదు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే నెలలో 71.3 అడుగులతో గోదారి బీభత్సం సృష్టించడంతో ముంపువాసులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేసి పునరావాస ప్రాంతాలకు తరలిపోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ప్రస్తుతం గోదావరి 48.30 అడుగులు దాటింది. దీంతో వరద మరింత పెరిగితే పరిస్థితి ఏమిటని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్లతోపాటు బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
-బూర్గంపహాడ్, ఆగస్టు 20
గత మూడేళ్ల క్రితం జూలై నెలలో బూర్గంపహాడ్ మండల కేంద్రాన్ని గోదావరి వరద ముంచెత్తింది. రికార్డు స్థాయిలో 71.3 అడుగులకు గోదావరి వరద ప్రవాహం రావడంతో బూర్గంపహాడ్ మండల కేంద్రంతోపాటు పరిసర గ్రామాలైన నాగినేనిప్రోలురెడ్డిపాలెం, మోతే పట్టీనగర్, ఇరవెండి, సారపాకలో లోతట్టు ప్రాంతాలతోపాటు అశ్వాపురం మండలంలోని పరిసర ప్రాంతాలు, మణుగూరులో లోతట్టు ప్రాంతాలు, పలు రహదారులు వరద నీటిలో మునిగాయి. గోదావరి వరద కారణంగా జిల్లాలోని 80 గ్రామాలు, 16 వేల నివాసాలు వరద నీటి ముంపునకు గురవ్వగా.. 22 వేల మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ఇదిలా ఉండగా.. ఒక్క బూర్గంపహాడ్ మండలంలోనే 7 వేలకు పైగా నివాసాలు వరద బారినపడ్డాయి. అంతేకాకుండా జిల్లాలో 11 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
ఇటు పక్క గోదావరి.. అటు పక్క కిన్నెరసాని వరదతో బూర్గంపహాడ్ ముంపు మండలవాసులకు తీరని కష్టాలు. ఇటు గోదావరి వరద పెరిగినా.. అటు కిన్నెరసాని వరద పెరిగినా మధ్యలో ముంపు మండలమైన బూర్గంపహాడ్, పరిసర ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కిన్నెరసాని పోటెత్తితే మండల పరిధిలోని జిన్నెగట్టు, ఉప్పుసాక, పినపాక పట్టీనగర్, బుడ్డగూడెం, సోంపల్లి, బూర్గంపహాడ్ గ్రామాల రైతులకు పంట భూములకు తీరని నష్టం, వరద ప్రభావం తప్పదు.
ఇప్పటికే గోదావరి గత ఆరున్నర దశాబ్ధాల కాలంలో జూలైలో ఏకంగా 14సార్లు 43 అడుగుల తొలి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించింది. ఇందులో ఆరు సార్లు తుది ప్రమాద హెచ్చరిక (మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులు) సైతం దాటడం గమనార్హం. 1972 జూలై 6వ తేదీన 44.3 అడుగులు, 1976 జూలై 22న 63.9 అడుగులు, 1988 జూలై 29న 54.3 అడుగులు, 2003 జూలై 27న 45.8 అడుగులు, 2008 జూలై 6న 47.3 అడుగులు, 2013 జూలై 19న 57 అడుగులు, 2013 జూలై 24న 56.7 అడుగులు, 2016 జూలై 12న 52.4 అడుగులు, 2022 జూలై 15న 71.3 అడుగులు, 2023 జూలై 30న 56.1 అడుగులు, 2024 జూలై 27వ తేదీన 53.6 అడుగులకు చేరుకోగా.. గత ఏడాది అదే గరిష్ఠ వరద నీటి ప్రవాహంగా నిలిచింది. తాజాగా బుధవారం రాత్రి 11 గంటలకు 48.30 అడుగులకు చేరింది.