రైతు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుచేయకుండా ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ సమయంలో సహకార సంఘాల ఎన్నికలకు వెళ్తే అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదని రేవంత్ ప్రభుత్వం భావించినట్లు స్పష్టమవుతోంది. దీనినుంచి బయటపడుతూనే తన కుటిల బుద్ధిని చూపించుకోవాలన్న కుట్రకు కూడా కాంగ్రెస్ సర్కారు తెరలేపిందన్న వాదనలు వినిపిస్తున్నారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించిన రైతుల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకోవడం కంటే అసలు సహకార సంఘాల ఎన్నికలనే రద్దు చేసి నామినేటెడ్ పద్ధతిలో తమ కార్యకర్తలకు పదవులను పంచిపెడితే బయటపడవచ్చన్న దుర్బుద్ధిని ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకోసమే సహకార ఎన్నికల రద్దు కోసం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నేడో రేపే ఈ నిర్ణయానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.
-భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటింది. ఈ రెండేళ్లలో అరకొర ఆర్భాటాలు తప్ప రైతులను ఏమాత్రమూ పట్టించుకోలేదు. పైగా రైతు సంక్షేమ పథకాలను విస్మరించింది. గత యాసంగి రైతుభరోసా ఎగ్గొట్టింది. వానకాలంలో ఊరించి ఉసూరుమనిపించి చివరి సమయాన పంటలు ముగిసేనాటికి అందించింది. ఇక, యూరియా పంపిణీలో కూడా రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీంతో అన్నదాతలందరూ ప్రభుత్వంపై ఆగ్రహావేశాల మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో సొసైటీ సంఘాలకు వెళ్తే కర్షకుల నుంచి పరాభవం తప్పదన్న భావనకు వచ్చిన రేవంత్ సర్కారు.. దొడ్డిదారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ‘సహకార ఎన్నికలు నిర్వహించాలా? లేక ఇప్పటికే పొడిగించిన పాలకవర్గాలను రద్దు చేసి నామినేటెడ్ పద్ధతిలో తమ పార్టీ కార్యకర్తలను చైర్మన్లును, సభ్యులను నియమించుకోవాలా?’ అనే అంశాలపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చించుకున్నట్లు సమాచారం.
మరి కొత్త సొసైటీల ఏర్పాటు సంగతి?
భద్రాద్రి జిల్లాకు 21 సొసైటీలున్నాయి. కొత్త జిల్లాలో రైతుల సంఖ్యకు అనుగుణంగా సహకార సంఘాలు లేకపోవడంతో 21 సంఘాలకే ఎన్నికలు నిర్వహించారు. సంఘాల్లో సభ్యులు సంఖ్య పెరగడంతో కొత్త సంఘాల ఏర్పాటు అనివార్యమైంది. దీంతో కొత్త సొసైటీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. 8 సొసైటీలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. నేడో రేపే అధికారికంగా ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. అయితే, సొసైటీల పాలకవర్గాలకు ఇప్పటికే రెండోసారి పదవీకాలాన్ని పొడిగించించిన ప్రభుత్వం.. అకస్మాత్తుగా ఆయా పాలకవర్గాలను ఏకంగా రద్దుచేస్తున్నట్లు సంకేతాలిచ్చింది. పైగా, ఎన్నికలకు వెళ్లకుండా నామినేటెడ్ పద్ధతిని అవలంబించే అవకాశాలను ప్రయత్నిస్తుండడంతో రైతుల్లో మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే, నామినేటెడ్ పద్ధతిలో సొసైటీల పాలకవర్గాలను నియమిస్తే తమను అర్థం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించే అవకాశమే లేకుండా పోతుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఆ పదవులన్నింటినీ కాంగ్రెస్ నాయకులతో నింపే ప్రమాదం ఉండడంతో సొసైటీలన్నీ వారి అవినీతి అక్రమాల్లో కూరుకుంటాయని, రైతులు దాచుకున్న సొమ్ముకు భద్రత లేకుండా పోతుందని భయాందోళన చెందుతున్నారు.
అన్నదాతల్లో తీవ్ర వ్యతిరేకత..
రైతు సంక్షేమాన్ని విస్మరించడం, రైతులకిచ్చిన హామీలను అమలుచేయకపోవడం, పైగా రైతులను ఆదుకోకుండా వారిని ముప్పుతిప్పలు పెట్టడం వంటి కారణాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దీనికితోడు యూరియాను సకాలంలో, సరిపడినంత అందించకపోవడంతో రైతులంతా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు యూరియా కోసం కొత్తగా మొబైల్ యాప్ కూడా తేవడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాల మాఫీకాక, బోనస్‌ను సకాలంలో జమచేయక, రైతుభరోసానా కూడా సక్రమంగా అందించక ముప్పుతిప్పలు పెట్టడంతో అన్నదాతల్లో అసహనం తారస్థాయికి చేరింది.
కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం..
జిల్లాలో ఇప్పటికే 21 సొసైటీలున్నాయి. వీటిల్లో 90,249 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. కొన్ని సంఘాల్లో సభ్యులు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల కొత్తగా 8 సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశాం. పాత సొసైటీల పదవీకాలం పూర్తయినందున త్వరలో ఎన్నికలు ఉంటాయని అనుకుంటున్నాం. ఎన్నికలు ఉండవని కొందరు అంటున్నారు. ప్రభుత్వం నుంచి మాకు అధికారికంగా సమాచారం లేదు.
-శ్రీనివాసరావు, జిల్లా సహకార అధికారి
ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది..
రైతులను ముప్పు తిప్పలు పెట్టడంతో ప్రభుత్వంపై అన్నదాతల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. రైతుబంధును పెంచుతానన్న ప్రభుత్వం మాట తప్పింది. అందులోనూ ఎన్నో కోతలు పెట్టింది. రుణమాఫీని కూడా అందరికీ చేయలేదు. అందుకే, ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం వెనుకడుగేస్తోంది.
-నల్లమోతు వెంకటనారాయణ. గుంపెన సొసైటీ మాజీ వైస్ చైర్మన్
యూరియా విషయంలో చాలా ఇబ్బంది పెట్టింది..
వానకాలం సీజన్లో యూరియా విషయంలో ప్రభుత్వం రైతులను చాలా ఇబ్బంది పెట్టింది. సొసైటీ కార్యాలయాల్లో రోజుల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఏడాదిలో ఆరు నెలలు ఎరువుల కోసమే తిరగాల్సి వచ్చింది. రైతులం చాలా ఇబ్బందులు పడ్డాం.
-పెద్దిని వేణు, రైతు సంఘం నాయకుడు, చండ్రుగొండ
రైతుల కష్టాలు ప్రభుత్వానికి తెలియట్లేదు..
రైతుల సమస్యలు, కష్టాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియడం లేదు. యూరియా కోసం ఇబ్బందులు పెట్టింది చాలక ఇప్పుడు కొత్తగా యాప్‌ను తీసుకొచ్చింది. రైతుల్లో చాలామంది నిరక్ష్యరాస్యులైనందున వారికి ఈ యాప్ గురించి అవగాహన ఉండదు. రైతుల ఆగ్రహం తప్పదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లట్లేదు.
-ఉన్నం నాగరాజు, గానుగపాడు సొసైటీ మాజీ డైరెక్టర్