ఖమ్మం అర్బన్, నవంబర్ 18: ఖమ్మం నగరంలో వచ్చే డిసెంబర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్ సక్సెస్ అవుతుందా.. లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ కోసమే ఎప్పుడు డైట్ కాలేజీ వైపు చూడని విద్యాశాఖ అధికారులు ఏకంగా రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్ నిర్వహించేందుకు మంగళవారం కాలేజీని పరిశీలించారు. జిల్లాస్థాయిలో నిర్వహించే సైన్స్‌ఫెయిర్, ఇన్స్పైర్ కోసం ప్రతి సంవత్సరం ఎస్ఎఫ్ఎస్, సెయిట్ జోసెఫ్ పాఠశాలలపై ఆధారపడుతుంది జిల్లా విద్యాశాఖ. గత పదిహేను సంవత్సరాల కిందట రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌ను ఖమ్మంలోని ‘లక్ష్య’ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా నిర్వహించారు. అయితే డైట్ సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్)గా మారుతున్న తరుణంలో కాలేజీ భవనాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఎంతవేగంగా చేసినా పనులు పూర్తికావడానికి కనీసం రెండునెలలు పట్టొచ్చని ఇంజినీరింగ్ అధికారులే పేర్కొంటున్నారు.
70 శాతం కూడా పూర్తికాలే..
డైట్ కళాశాల సీవోఈగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు రూ.8.50 కోట్లు కేటాయించింది. దీనిలో భాగంగా నూతన భవన నిర్మాణం, పాత భవనంలో మరమ్మతులు, హాస్టల్‌కు అవసరమైన విధంగా నిర్మించాల్సి ఉంది. గత రెండునెలల క్రితం విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు డైట్‌ని సందర్శించారు. పరిశీలన సమయంలో పలు మార్పులు సూచించారు. పాత భవనంలో మరమ్మతులు పూర్తి కాగా నూతన భవనంలో ఫ్లోరింగ్, కిటికీలు, తలుపులు, కరెంట్ పనులు, 30శాతం ఇతర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులు అన్ని పూర్తిచేసేందుకు 2026 మార్చి నెలాఖరు వరకు పట్టొచ్చు. ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన డైట్ కళాశాలకు జూలై నెల తర్వాత నుంచి రెగ్యులర్ ప్రిన్సిపాల్‌నే నియమించలేదు. ఉద్యోగులు జీతాలు నిలిచిపోయే పరిస్థితుల్లో ఎస్సీఈఆర్టీలో డీడీగా పనిచేస్తున్న రాజేష్‌ను ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించారు.

డైట్, గురుకుల పాఠశాలల పరిశీలన
రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్ నిర్వహించేందుకు మంగళవారం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేష్, ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్, డైట్ ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్ ఎన్.రాజేష్, ఖమ్మం డీఈవో చైతన్యజైనీ, ఇంజినీరింగ్ ఈఈ బుగ్గయ్యలు కలిసి ఖమ్మం నగరంలోని డైట్ కళాశాలను పరిశీలించారు. ఎన్ని ఎకరాల విస్తీర్ణం, ఎన్ని గదులు ఉన్నాయో తెలుసుకున్నారు. తర్వాత పక్కనే ఉన్న గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను పరిశీలించారు. అన్ని జిల్లాల నుంచి వచ్చే విద్యార్థుల ప్రదర్శనలకు 45 గదులు ఉంటే సైన్స్‌ఫెయిర్‌కు అవసరమని డిసెంబర్ 15 లోపు పూర్తి చేయగలరా అని అడిగి తెలుసుకున్నారు. అయితే డైట్లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో 6 పెద్దవి (పది వేల చదరపు అడుగులు), పైన 9 గదులు ఉన్నాయని, కరెంట్ పనులు పూర్తికాలేదని, వేగంగా చేసినా జనవరి చివరి వరకు పూర్తి చేయవచ్చని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.