అశ్వారావుపేట, జనవరి 24 : తనను కోసినా పైసాలేదని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని అభివృద్ధి ఎలా చేస్తాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రశ్నించారు. శనివారం అశ్వారావుపేటలోని శ్రీ సత్యసాయి కల్యాణ మండపంలో మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా అడిగిన నిధుల కంటే ఎక్కువ మంజారు చేసి అభివృద్ధి, సంక్షేమ పథకాలకు తోడ్పాటునిచ్చారని గుర్తుచేశారు. ప్రజలను మోసంచేసి అమలు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేవంటూ హామీలను నిర్లక్ష్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
అక్రమాలు, అవినీతిని బయటకు తీస్తున్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు, పార్టీ నేతలను అక్రమ కేసులతో భయందోళనలకు గురిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నారని, సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కుంభకోణాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శించారు. బంగారు తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంతోనే సాధ్యమని, ఆయన మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 2028లో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, మూడోసారి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. అన్నివర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాజకీయాలకతీతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అసమర్థ పాలనపై విసుగుచెంది కేసీఆర్ పాలన కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశారు.
త్వరలో జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమష్టిగా కలిసి పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. అశ్వారావుపేట మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగిరేలా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్, సీపీఎం నుంచి బీఆర్ఎస్లో చేరిన పాలవలస జీవన్‌రావు, తగరం జగన్నాధంలకు కండువా కప్పి పార్టీలోకి రేగా కాంతారావు ఆహ్వానించారు. పట్టణంలోని వెలుగు జాకబ్, చిక్కం గోపాలకృష్ణలను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో రూ.800 కోట్లతో అభివృద్ధి చేశారని, అశ్వారావుపేటకే రూ.250 కోట్లు కేటాయించినట్లు వివరించారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు యూఎస్ ప్రకాశ్‌రావు, సున్నం నాగమణి, వగ్గెల పూజ, కోటగిరి సీతారామస్వామి, జూపల్లి పద్మజ, బ్రహ్మారావు, మందపాటి రాజమోహన్‌రెడ్డి, జుజ్జూరు వెంకన్నబాబు, టీడీపీ నాయకులు కట్రం స్వామిదొర, నార్లపాటి శ్రీనివాసరావు, జనసేన నాయకులు వినోద్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.