చండ్రుగొండ, జనవరి 28 : ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను ఎప్పటికప్పడు ఎండగట్టాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దామరచర్లలో మండల పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ అమలుకాని, ఆచరణకు నోచుకోని హామీల గురించి ప్రజాక్షేత్రంలో, గ్రామసభల్లో ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకున్నదని ఆరోపించారు. ఈడీ దాడుల్లో మంత్రి పొంగులేటి ఇంట్లో పట్టుబడిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని ప్రజల పక్షాన ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం బీఆర్ఎస్దేనన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా..: మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నియోజకవర్గ కార్యకర్తలకు, కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ నాయకుడు మేడా మోహన్‌రావుకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. గత కేసీఆర్ పాలనను పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మెచ్చుకుంటుంటే.. సీఎం రేవంత్‌రెడ్డికి విలువలేకుండా పోయిందన్నారు. ఎన్నికల సమయంలో రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామనడం ప్రజలను మెసం చేయడమే అవుతుందన్నారు. కల్యాణలక్ష్మి డబ్బులు, తులం బంగారం ఇచ్చే వరకు విడిచిపెట్టేది లేదన్నారు. సమావేశంలో నియోజకవర్గ నాయకులు వగ్గెల పూజ, జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశ్‌రావు, పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి దారా వెంకటేశ్వరరావు, సంగొండి రాఘవులు, కొణకండ్ల వెంకటరెడ్డి, నల్లమోతు వెంకటనారాయణ, నరుకుళ్ల సత్యనారాయణ, మేడా మోహన్‌రావు, సూర వెంకటేశ్వరరావు, భూపతి రమేశ్, గాదె లింగయ్య, ఉన్నం నాగరాజు, గుగులోత్ రాందాసు, పాండ్ల అంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు.