వైరా టౌన్, అక్టోబర్ 2: ప్రజలు గ్యారంటీలు, వారంటీలు అంటున్న పార్టీలను నమ్మొద్దని, సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో తొలుత ఎమ్మెల్యే రాములునాయక్, బీఆర్ఎస్ వైరా ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌లాల్‌తో కలిసి రోడ్ షో నిర్వహించి అనంతరం పట్టణంలోని కమ్మవారి కల్యాణ మండపంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యారంటీల గురించి మాట్లాడే పార్టీని గెలిపిస్తే రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు సమష్టిగా పని చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు.
చిన్న చిన్న భేషజాలను పక్కన పెట్టి వైరా నియోజకవర్గం నుంచి మదన్‌లాల్‌ను గెలిపించి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే టికెట్ తనకు కాగితంతో సమానమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలుపు గుర్రం కాదని, అయినప్పటికీ బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌లాల్ గెలుపుకోసం పనిచేస్తానన్నారు. తనకు కక్ష సాధింపులకు పాల్పడే ఆలోచనే లేదన్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని శిరసా వహిస్తానన్నారు. బీఆర్ఎస్ వైరా ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌లాల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాములునాయక్ నాలుగున్నర ఏళ్ల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడారని, ఆయన సపోర్ట్‌తో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘ఎమ్మెల్యే బావ రాములునాయక్ కృష్ణుడు అయితే నేను అర్జునుడి లాంటి వాడిని..’ అని సభాముఖంగా ప్రకటించారు.
సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, వైరా అభ్యర్థిని గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలన్నారు. వైరా నియోజకవర్గ ప్రజల కోసం ఇద్దరం పాటుపడతామని అన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ పసుపులేటి మోహన్‌రావు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, జడ్పీటీసీలు నంబూరి కనకదుర్గ, పోట్ల కవిత, ఎంపీపీ వేల్పుల పావని, దిశ కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జున్‌రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, కౌన్సిలర్లు వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ కోటయ్య, లాల్‌మహ్మద్, దారెల్లి పవిత్రకుమారి, ఏదునూరి పద్మజ, మాదినేని సునీత, వనమా చిన్ని, పెరుమాళ్ళ కృష్ణమూర్తి, ఏదునూరి శ్రీను, మరికంటి శివ, కొత్తా వెంకటేశ్వరరావు, దొంతెబోయిన వెంకటేశ్వర్లు, దొంతెబోయిన గోపి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ నామా సమక్షంలో బిఆర్ఎస్లో పలువురి చేరిక
వైరాటౌన్, అక్టోబర్ 2: వైరా మండలంలోని గొల్లెనపాడు గ్రామానికి చెందిన 12 కుటుంబాలు బీఆర్ఎస్ అభ్యర్ధి బానోత్ మదన్‌లాల్ ఆధ్వర్యంలో ఎంపీ నామా నాగేశ్వరరావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. సోమవారం స్థానిక కమ్మవారి కళ్యాణ మండపంలో వారికి ఎంపీ నామా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం
ఖమ్మం రూరల్, అక్టోబర్ 2 : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మండలంలోని దానవాయిగూడెం పరిధిలో గల జిల్లా జైలులో సోమవారం ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. జైలు పర్యవేక్షణాధికారి ఏ.శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కుమారి ఎన్.అమరవాతి, గౌరవ అతిథిగా జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావిద్ పాషా, ఆత్మీయ అతిథిగా ఖమ్మం నగర అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మాగాంధీ సూచించిన విధంగా అహింస, శాంతి మార్గంలో నడవాలన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు సహజమన్నారు. క్షణికావేశంలో జైలుకు వచ్చిన ఖైదీలు ఇక్కడ శిక్ష అనుభవించి బయటకు వెళ్లేటప్పుడు మార్పు రావాలన్నారు. కార్యక్రమంలో జైలర్లు సక్రునాయక్, జీ లక్ష్మీనారాయణ, జైలు వైద్యుడు సిద్ధార్థ్‌తోపాటు జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.