– కేసీఆర్ దళితుల అభ్యున్నతికి చేసిన సేవలు మరువలేం
– ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై బీఆర్ఎస్ దళిత సంఘం నేతల ఫైర్
వైరా టౌన్, సెప్టెంబర్ 09 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై వైరా బీఆర్ఎస్ దళిత సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు మద్దెల రవి, ఆదూరి ప్రేమ్ కుమార్, మున్నేరు సత్యానందం, గుజ్జర్లపూడి దేవరాజు, చాట్ల దానయ్య మాట్లాడారు. కేసీఆర్‌కు హాని కలిగించేలా, ఆయన మరణాన్ని కోరుకునే విధంగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని నాయకులు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలకు హద్దులు ఉంటాయని, వ్యక్తిగతంగా దూషించడం, ప్రాణహాని కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ప్రయత్నం చేశారని నాయకులు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకనే కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలే ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని అన్నారు.కేసీఆర్‌పై ఇకపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని బీఆర్ఎస్ దళిత సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దొంతబోయిన శ్రీనివాసరావు, భట్ట భద్రయ్య, విలాస్ సాగరం నరేష్, రేచర్ల సైదులు, రాజు సోమవారం వల్లేపు రాము, మాచర్ల శంకర్, ఏలూరు నరసింహారావు, ముదిగొండ పుల్లయ్య పాల్గొన్నారు