భద్రాచలం, ఆగస్టు 21 : భద్రాచలంలో ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. పట్టణంలోని హరిత టూరిజం హోటల్లో బీఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్‌కుమార్ అధ్యక్షతన మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశం గురువారం జరిగింది. ముఖ్యఅతిథిగా రేగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచి సమన్వయంతో కలసికట్టుగా పని చేయాలని కోరారు.
సమష్టి నిర్ణయాలతో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భద్రాచలం మండలంలోని అన్ని వార్డుల్లో కమిటీలు వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలో ప్రజలు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, ప్రజల ఆశీర్వాదంతో తిరిగి బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు. సెప్టెంబర్ మొదటి వారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భద్రాచలం రానున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మానే రామకృష్ణ, సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, తాండ్ర వెంకట రామారావు, మార్కెట్ మాజీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, మండల పార్టీ కో కన్వీనర్ రేపాక పూర్ణచందర్రావు, మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులు కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మి, సీనియర్ నాయకులు కోటగిరి ప్రబోద్‌కుమార్, కొల్లం జయప్రేమ్కుమార్, కోలా రాజు తదితరులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం భద్రాచలం గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధ) కార్యదర్శి పొలిశెట్టి శ్రీనివాసరావు, ఆటో యూనియన్ నాయకులు రాము, అప్పారావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రేగా కోరారు.