ఖమ్మం, డిసెంబర్ 30: పెన్షనర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పెన్షనర్ల సంఘం నిర్వహించిన వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పింఛనుదారుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 40 ఏళ్ల రాజకీయ అను భవంలో తాను ఏనాడూ ఉద్యోగులను ఇబ్బంది పెట్టలేదన్నారు. అనంతరం పెన్షనర్స్ సంఘానికి సంబంధించిన డైరీ, క్యాలెండర్లను ఆవిషరించారు. కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పెన్షనర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు ఎర్నేని రామారావు, అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సుబ్బయ్య, కల్యాణం కృష్ణయ్య, రిటైర్డ్ తహసీల్దార్ పూస సాంబశివరావు పాల్గొన్నారు.