ఖమ్మం, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కుల, మత, వర్గాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీని లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయమైన నగరంలోని సంజీవరెడ్డి భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం తుకుగూడ జరుగనున్న జనగర్జన సభ దేశానికి దిశా నిర్దేశం చేయనుందన్నారు. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను తుకుగూడ సభ నుంచే ఏఐసీసీ నాయకత్వం ప్రకటించనుందని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దికు కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుకుగూడ సభ నుంచే ఏఐసీసీ నేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకగాంధీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలకు దేశమే ఆశ్చర్యపోయిందని అన్నారు.
కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చామన్నారు. మూడు నెలల్లోనే 64.75 లక్షల మంది రైతులకు రైతుబంధు మొత్తాన్ని జమ చేశామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నామని, 2030-31 వరకు పీక్ డిమాండ్‌ను అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. తుక్కుగూడ సభకు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, వరంగల్ నుంచి మహబూబ్‌నగర్ వరకు కదలి రావాలని కోరారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర అధ్యక్షుడు జావీద్, మహిళా నేత దొబ్బల సౌజన్య పాల్గొన్నారు.