కూసుమంచి, ఆగస్టు 9 : నీటిపారుదల శాఖ అధికారులు సాగర్ ఆయకట్టు పరిధిలోని అన్ని మేజర్లు, మైనర్లకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. వానకాలం సాగుకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పాలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేసిన విషయం విదితమే. అయితే క్రమంగా నీటి విడుదల సామర్థ్యం పెంచుతూ శుక్రవారం వరకు 4 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ నుంచి పాలేరు జలాశయానికి 3,899 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. పాలేరు చానల్‌కు 320 క్యూసెక్కులు, మిషన్ భగీరథ తాగునీటి కోసం 135 క్యూసెక్కులు, రెండో జోన్‌కు 2,126 క్యూసెక్కులు, వరద ద్వారా 270 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అలాగే భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా 275 క్యూసెక్కులు, నందిగామ బ్రాంచ్ కాలువకు 430 క్యూసెక్కులు, మంగాపురం మేజర్‌కు 77 క్యూసెక్కులు, క్రాస్ రెగ్యులేటర్‌కు 1,125 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 20.35 అడుగులు ఉంది.