భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : ఎక్కడో తాగునీటి సమస్య ఉందంటూ అక్కడి ప్రజలు మొరపెట్టుకుంటుండడాన్ని మామూలుగా చూస్తూనే ఉంటాం. కానీ సాక్షాత్తూ జిల్లా పెద్దసారు (కలెక్టర్) పాలనా బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఐడీవోసీలోనే తాగునీటి సమస్య ఉందంటే నమ్ముతారా? కానీ నమ్మాలి. అది నిజం కూడా. ప్రజల సౌలభ్యం కోసం గత కేసీఆర్ ప్రభుత్వం రూ.కోట్ల వ్యయంతో కొత్తగూడెంలో కలెక్టరేట్‌ను నిర్మించింది. అన్ని శాఖలనూ ఒకే చోటకు చేర్చింది. దీంతో రోజూ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఆయా శాఖల అధికారులను కలిసి తమ సమస్యలున విన్నవించుకుంటున్నారు. కానీ ఈ కార్యాలయంలో పనిచేసే అధికారులను, ఉద్యోగులను, వారికి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే అర్జీదారులను తాగునీటి సమస్య వెంటాడుతోంది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50కి పైగా శాఖల అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ప్రతీ సోమవారం జరిగే ‘ప్రజావాణి’లో తమ సమస్యలపై వినతులు ఇవ్వడానికి వందలాదిమంది అర్జీదారులు వస్తున్నారు. కానీ వీరందరికీ ఈ కలెక్టరేట్లో గుక్కెడు నీళ్లు లభించడం గగనంగా మారింది. దీంతో అందులో పనిచేసే ఉద్యోగులు, ఉన్నతాధికారులు బయట నుంచి టిన్నుల ద్వారా నీళ్లు తెప్పించుకుంటున్నారు. మరుగుదొడ్ల వినియోగానికి బోర్ నీటిని వినియోగించుకుంటున్నప్పటికీ తాగునీటికి మాత్రం కటకట ఏర్పడుతోంది.
అయితే, బయటి నుంచి టిన్నులు తెచ్చుకునే క్రమంలో కొంచెం ఆలస్యం జరిగినా ఆ కార్యాలయంలోని అధికారులకు గొంతెండుతున్న పరిస్థితి. కార్యాలయాలకు వచ్చే ఇతర ప్రముఖులకు కూడా సకాలంలో నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. అత్యవసరమైతే క్యాంటీన్‌కు వెళ్లి తాగాల్సిన దుస్థితి. ఇక ప్రజావాణి కార్యాలయంలో ఏర్పాటుచేసిన వాటర్ టిన్నులోని నీళ్లు కొద్దిమంది తాగగానే అయిపోతున్నాయి. మిగతా వాళ్ల గొంతు ఎండాల్సిన పరిస్థితి.
కలెక్టరేట్ పైభాగంలో మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంకు ఉంది. వాటర్ గ్రిడ్ ద్వారా ఆ ట్యాంకుకు భగీరథ నీరు చేరుతుంది. కానీ అది కలెక్టరేట్లోని కార్యాలయాలకు మాత్రం వెల్లడం లేదు. కలెక్టరేట్‌కు నల్లాల కనెక్షన్లు లేనందునే నీళ్లు వెళ్లడంలేదని భగీరథ అధికారులు చెబుతున్నారు. పైపులైన్లు ఉంటే నీరు సరఫరా చేస్తామని పాల్వంచ మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
పెద్ద సారు కార్యాలయంలో తాగునీటి సమస్య ఉండకూడదు. అసలే వేసవి కాలం. దప్పికకు తాళలేం. కలెక్టరేట్‌కు చాలామంది ప్రజలు వస్తుంటారు. ముఖ్యంగా వృద్ధులు, షుగర్ పేషెంట్లకు నీళ్లు అందుబాటులో ఉండాలి. కుండలతోనైనా చల్లని నీటిని ఏర్పాటు చేస్తే మంచిది. ఆసుపత్రుల్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా వాటర్ కూలర్లు పెట్టి తాగునీటిని అందుబాటులో ఉంచాలి.
-శ్రావణబోయిన నర్సయ్య. కొత్తగూడెం
ఐడీవోసీ నిర్మాణం జరిగినప్పుడు ఆ సమస్య పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం నల్లాలు ఏర్పాటుచేయడం కోసం ప్రతిపాదనలు తయారు చేశాం. త్వరలో అన్ని కార్యాలయాలకు తాగునీటిని అందుబాటులోకి తీసుకొస్తాం. అప్పటి వరకు ఎవరి ఆఫీసులకు వారు టిన్నులు ద్వారా నీళ్లు తెప్పించుకుంటున్నారు. ప్రజావాణి కార్యాలయంలో కూడా తాగునీటిని ఏర్పాటు చేస్తున్నాం.
-రమాదేవి, పరిపాలన అధికారి, కలెక్టరేట్