Karepalli | కారేపల్లి, డిసెంబర్ 11 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు లీకవుతున్నాయి. దాంతో నీరంతా వృథాగా పోతున్నది. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మాణిక్యారం, గుడితండా, మేకలతండా తదితర గ్రామాల్లో నడిరోడ్డుపై పైపులు లీకైనా నీరందా వృథాగా పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లందు పట్టణం సమీపంలోని కోరగుట్టపై భారీ సంపు నిర్మాణం చేపట్టింది.

దీని ద్వారా మండలంలోని ఆయా గ్రామాల్లో తాగునీటిని అందించేందుకు ప్రత్యేకంగా పైపులైన్లు వేశారు. అయితే, పైపులైన్ల లీక్ అవుతుండడంతో నీరు లీకవుతుంది. అదే సమయంలో నీరు లీక్ అవుతుండడంతో రోడ్లు సైతం బురద మయంగా మారుతున్నాయి. పలు సందర్భాల్లో మురుగు నీరు పైపులైన్లలోకి వెళ్లి కలుషితమవుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. పైప్లైన్ల సరి చేసి.. స్వచ్ఛమైన నీటిని అందించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
