ఇల్లెందు రూరల్, సెప్టెంబర్ 5: నియోజకవర్గ కేంద్రానికే తలమానికంగా నేచర్ పార్కును తీర్చిదిద్దుతామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(పీసీసీఎఫ్) సువర్ణ అన్నారు. పూసపల్లి, కరెంట్ ఆఫీస్ ప్రాంతాల్లోని కోరగుట్టను శుక్రవారం సందర్శించిన ఆమె.. నేచర్ పార్కులో వాచ్ టవర్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కోరగుట్ట ప్రాంతంలోని నేచర్ పార్కును మరింత ఆహ్లాదకరంగా సరికొత్త హంగులతో తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇంటిల్లిపాది కుటుంబంతో ఆనందంగా గడిపేందుకు కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఇల్లెందు పట్టణ, మండల, పరిసర ప్రాంత ప్రజలతోపాటు ఇతర జిల్లాలవాసులకు కూడా నేచర్ పార్కు మానసికోల్లాసాన్ని, నూతనోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలతోపాటు నిరంతరం అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను ఎవరైనా నరికివేసినా లేదా వాటిని నష్టపర్చాలని ప్రయత్నం చేసినా వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పూసపల్లిలోని వనమహోత్సవం, వెదురు, ప్లాంటేషన్లను పరిశీలించారు. కార్యక్రమంలో సీసీఎఫ్ బీమానాయక్, డీఎఫ్వో కృష్ణగౌడ్, ఎఫ్డీవో కరుణాకర్, ఎఫ్ఆర్వోలు చలపతిరావు, నరసింహారావు, డీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.