ఖమ్మం ఇలాకాలో ఏకంగా ముగ్గురు మంత్రులున్నరు. జిల్లా ఉన్నతాధికారులూ తిరుగుతున్నరు. అయినప్పటికీ ఖమ్మం జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు మాత్రం ఆకలితో అలమటిస్తున్నరు. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో బడుగు జీవులు ఖాళీ కడుపులతో రోదిస్తున్నరు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరితో విసిగి వేసారిన కార్మికులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఇప్పటివరకు నిలిచిన బకాయిలు మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు. తొలుత బీఆర్ఎస్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల మద్దతుతో జనరల్ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మాతా, శిశు సంరక్షణ కేంద్రంలోని వెయిటింగ్ షెడ్డులో సమావేశమై ప్రభుత్వం, స్థానిక అధికారుల అలసత్వాన్ని కడిగిపారేశారు. స్థానిక మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ వారి వద్దకు వచ్చి ఎలాంటి హామీ ఇవ్వకుండానే విధుల్లో చేరాలని కోరగా, కార్మికులు ససేమిరా అంటూ భీష్మించారు.
-ఖమ్మం సిటీ, మే 6
పెద్దాసుపత్రిలో నెలకొన్న సమస్యను పరిష్కరించడంలో స్థానిక యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో కార్మికులకు క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించేవారు. తెలంగాణలో ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగిందో నాటినుంచి పరిస్థితులు పూర్తిగా మారాయి. నాలుగు నెలలు గడిచినా వేతనాలు అందని దుస్థితి నెలకొంది. గత్యంతరం లేక బడుగు జీవులు ఆందోళనకు దిగితే కలెక్టర్ లేదా స్థానిక వైద్యాధికారులు జోక్యం చేసుకుని మున్సిపల్ కార్మికులను రప్పించి పోలీసు పహారాలో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. ఆ క్రమంలో కార్మికులు, అధికారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరగడం నిత్యకృత్యంగా మారింది. మంగళవారం సైతం ఆసుపత్రిలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వస్తున్న నేపథ్యంలో నగరపాలక సంస్థకు చెందిన పారిశుధ్య కార్మికులను తీసుకొచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన ఆసుపత్రి కార్మికులు అడ్డుకున్నారు. తమ ఆకలి పోరాటానికి సహకరించాలని పోలీసులను కాళ్లావేళ్లా పడి బతిమాలుకున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేసింది. ఉమ్మడి ఖమ్మంతోపాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి వైద్యసేవల నిమిత్తం దవాఖానకు వస్తున్న వందలాది మంది రోగులు, వారి సహాయకులకు సరైన వసతులు లభించక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ఖమ్మంజిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రతి నాలుగునెలలకోసారి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది. కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నర పాలనలో ఆరు దఫాలు వేతనాల కోసం ధర్నాలు జరిగాయంటే అక్కడి దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నది. ప్రతి సందర్భంలోనూ ఒకటి లేదా రెండు నెలల వేతనం ఇవ్వడం, కార్మికులను ఏమార్చడం షరా మామూలైంది. సర్కారు నుంచి పైసలు వస్తేనే తాను వేతనాలు చెల్లిస్తానంటూ సంబంధిత గుత్తేదారు చేతులెత్తేస్తున్నాడు.. తామేమీ చేయలేమంటూ స్థానిక వైద్యాధికారులు మిన్నకుండిపోతున్నారు.. వెరసి కాంట్రాక్ట్ కార్మికులు అర్ధాకలితో మగ్గడం, రోగులు తీవ్ర అవస్థలు పడటం పాలకులకు కనిపించకపోవడం శోచనీయం. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులైన మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ జిల్లా దవాఖాన వైపు కన్నెత్తి చూడకపోవడంపై పలు కార్మిక, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సమస్యను పరిష్కరించకుంటే వారి క్యాంపు కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆందోళనలో బీఆర్ఎస్ కార్మిక సంఘం నాయకుడు మాతంగి అనిల్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.