మామిళ్లగూడెం, డిసెంబర్ 20: రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటరు జాబితా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. అలాగే, ఎన్నికలను పకడ్బందీ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో హైదరాబాద్ నుంచి బుధవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
ఫొటో ఎలక్టోరల్ రోల్‌కు సంబంధించి పెండింగ్ దరఖాస్తులన్నీ పరిషరించాలని, ఓటర్ల జాబితాను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ఎస్ఎస్ఆర్ ప్రక్రియ సమయంలోగా పూర్తి చేస్తామని, సంబంధిత దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిషరిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఇతర అధికారులు గణేశ్, అశోక్ చక్రవర్తి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.